తండ్రి కావాలనే కోరిక.. బ్రతికున్న కోడిపిల్లను మింగి వ్యక్తి మృతి.. కోడిపిల్ల సజీవం

దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నా.. మనుషుల ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికీ నరబలి ఇస్తే లంకె బిందెలు దొరుకుతాయని నమ్మే వారు బోలెడు మంది ఈ సమాజంలో ఉన్నారు. క్షుద్ర పూజలు చేస్తే అనారోగ్యం ధరిచేరదని నమ్మేవారు మరికొందరు. అటువంటి మూఢ నమ్మకమే ఓని వ్యక్తి నరకానికి చేరువ చేసింది. క్షుద్ర పూజల్లో భాగంగా బ్రతికున్న కోడిపిల్లను మింగి 35 ఏళ్ల వ్యక్తి ఆయువు తీసుకున్నాడు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. 

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లోని చింద్కా గ్రామానికి చెందిన ఆనంద్ యాదవ్(35 ) అనే ఏళ్ల వ్యక్తి స్నానం చేసి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఇంట్లో కుప్పకూలిపోయాడు. గమినించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతని గొంతులోని కుయ్.. కుయ్ అని శబ్దాలు రావడం విని ఆశ్చర్యపోయారు. వెంటనే స్కాన్ తీయగా.. అతని గొంతులో సజీవంగా ఉన్న కోడిపిల్లను కనుగొన్నారు. ఆ కోడి పిల్లను బయటకు తీసేలోపే అతని ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.

Also Read :- జింక్తో రోగాలకు చెక్

కోడిపిల్ల గొంతులో ఇరుక్కుపోయి, శ్వాస వెళ్లకుండా అడ్డుపడి చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. చివరకు అతని గొంతు కోసం సజీవంగా ఉన్న కోడిపిల్లను బయటకు తీశారు. తన కెరీర్‌లో ఇలాంటి కేసు ఎదురవడం ఇదే మొదటిసారని సదరు వైద్యులు ఒకరు చెప్పారు.

క్షుద్రపూజల అనుమానం!

ఆనంద్ యాదవ్ అసాధారణ మరణాన్ని క్షుద్ర పూజలే కారణమని గ్రామస్తులు చెప్తున్నారు. మృతుడు వారితో ఎప్పుడూ అలాంటి ఆలోచనలే పంచుకునేవారని అన్నారు. ఒక తాంత్రికుడితో అతనికి పరిచయాలు ఉన్నట్లు వెల్లడించారు. తండ్రి కావాలనే కోరిక తీర్చుకోవడం కోసమే అతను కోడిపిల్లను మింగేసి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.