అయ్యో.. ఆ తండ్రికి ఎంత కష్టమొచ్చింది

అయ్యో.. ఆ తండ్రికి ఎంత కష్టమొచ్చింది

భద్రాచలం, వెలుగు: చిన్నప్పుడు తన భుజాలపై ఆడించిన ఆ తండ్రి..  ఒక రోజు తన ముద్దుల కూతురు శవాన్ని మోసుకుంటూ నడవాల్సి వస్తుందని కలలో కూడా అనుకొని ఉండడు. కూతురు డెడ్​బాడీని ఇంటికి చేర్చడానికి కనీసం అంబులెన్సు కూడా అందుబాటులో లేక తల్లడిల్లాడా తండ్రి..  మరో దారిలేక 10 కిలో మీటర్ల పాటు భుజాలపైనే మోసుకుంటూ తీసుకెళ్లాడు. చత్తీస్ గఢ్​లో ని సుర్గూజా జిల్లాలో చోటు చేసుకుందీ విషాదం. అందాలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ కూతురు సురేఖ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో శుక్రవారం లఖన్ పూర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకొని వచ్చాడు. అప్పటికే పాప ఆక్సిజన్ లెవెల్స్ 60కి పడిపోవడంతో పరిస్థితి విషమించి కాసేపటికే చనిపోయింది. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో శవాన్ని భుజంపై వేసుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్లాడు. దారిలో  కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. స్వయంగా తన జిల్లాలోనే ఈ ఘటన జరగడంతో హెల్త్ మినిస్టర్ సింగ్ దేవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు.