మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలేనని కార్ల్ మార్క్స్ అన్నాడు. కానీ ఈ వార్త చదివిన తరువాత అందరు అలా ఉంటారని అనుకోవడం కూడా తప్పని అనిపిస్తుంది. ఛత్తీస్‌గఢ్ కు చెందిన ఓ ట్రాఫిక్ పోలీసుకు రోడ్డుపై రూ.40 లక్షలతో కూడిన ఒక బ్యాగ్ దొరికింది. అయితే.. వెంటనే అతడు స్వార్ధంగా ఆలోచించకుండా.. ఆ డబ్బును నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. ఇప్పుడతడిని డిపార్ట్ మెంట్ తో పాటు ప్రతి ఒక్కరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ ఘటన రాయ్పూర్ లో జరిగింది.
నయా రాజయ్ పూర్ లోని కయాబంధ పోస్ట్ కు అనుబంధంగా ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలంబర్ సిన్హాకు ఉదయం డ్యూటీ చేస్తుండగా రోడ్డుపై ఒక బ్యాగ్ కనిపించింది. ఏంటని దాని వద్దకు వెళ్లి ఓపెన్ చేసి చూడగా..అందులో రూ. 2000, 500 నోట్లతో మొత్తం రూ.40 లక్షలు కనిపించాయి. వెంటనే ఆ బ్యాగును స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అప్పగించాడు. కానిస్టేబుల్ సిన్హా నిజాయితీని, మంచితనం గురించి తెలుసుకున్న డిపార్ట్ మెంట్ సీనియర్ అధికారులు అతడికి రివార్డు ప్రకటించారు. మరోవైపు బ్యాగులో దొరికిన డబ్బు ఎవరిది..? రోడ్డుపై వెళ్లిన వ్యక్తులెవరు..? అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
