అప్పుడు ఛగన్ భుజ్ బల్.. ఇప్పుడు ఏక్ నాథ్ షిండే

అప్పుడు ఛగన్ భుజ్ బల్.. ఇప్పుడు ఏక్ నాథ్ షిండే

శివసేన పార్టీలో తిరుగుబాట్లు కొత్త కాదు. పార్టీ స్థాపించిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు అదే ఫార్ములా కంటిన్యూ అవుతోంది. పార్టీలో క్రమక్రమంగా ఎదిగి... అధినేత తర్వాతి స్థాయి వరకు చేరుకున్న నేతల్లో చాలా మంది రెబెల్స్ గా మారి కొందరు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఛగడన్ భుజ్ బల్ నుంచి రాజ్ థాక్రే.. ఇప్పుడు ఏక్ నాథ్ షిండే దాకా ఇవే సీన్లు రిపీట్ అవుతూ వచ్చాయి. అధినేత తర్వాతి స్థాయి రాగానే జెండా ఎత్తేయడం కామన్ గా మారుతోంది. ఇప్పుడు తిరుగుబాటు చేసిన ఏక్ నాథ్ షిండే కూడా సీఎం ఉద్ధవ్ థాక్రేకు రైట్ హ్యాండ్ గా ఉన్నారు.అసెంబ్లీలో శివసేన పక్ష నేతగా గతంలోనే ఎంపికయ్యారు. సీఎం పదవి ఆశించడం, చివరకు అధి దక్కక పోవడంతో తిరుగుబాటు ఎగరేసినట్లు చెబుతున్నారు. నిజానికి ప్రత్యక్ష పదవి చేపట్టకూడదని శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే నియమం పెట్టుకున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయన సీఎం పదవి ఏనాడూ చేపట్టలేదు. తమ పార్టీలోని ఇతరులకే అవకాశం ఇచ్చారు. కానీ బీజేపీతో తెగతెంపుల తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేన జట్టుకట్టడం, ఉద్దవ్ థాక్రే సీఎం పదవి చేపట్టడం, ఆయన కొడుకు ఆదిత్య థాక్రే మంతి పదవి చేపట్టడం జరిగిపోయాయి. ఇది ఏక్ నాథ్ షిండేకు నచ్చలేదంటున్నారు. 

1991లో మొదటగా ఛగన్ భుజ్ బల్ తిరుగుబాటు జెండా ఎగరేశారు. ప్రస్తుతం ఆయన ఎన్సీపీలో ఉన్నారు. ప్రస్తుత క్యాబినెట్ లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. శివసేనలో ఫస్ట్ రెబెల్ ఛగన్ భుజ్ బల్. 1991లో భుజ్ బల్ మజగావ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. అప్పట్లో ఆయన 52 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 17 మందితో రెబెల్ గా మారారు. అప్పట్లో ఆయన శరద్ పవార్ నేతృత్వంలోని కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దాంతో ఆయనకు డిప్యూటీ సీఎం హోంశాఖ వంటి కీలక పదవులు దక్కాయి. 

రాజ్ థాక్రే 2005లో శివసేన నుంచి వేరుపడి మహారాష్ట్ర నవ్ నిర్మాణ సేన ఏర్పాటు చేసుకున్నారు. థాక్రే కుటుంబీకుడే అయినా ప్రాధాన్యం దక్కడం లేదన్న ఉద్దేశంతో వేరుకుంపటి పెట్టుకున్నారు. శివసేన ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని విమర్శిస్తూ వేరుకుంపటి పెట్టుకున్నారు. 2009లో 13 సీట్లు గెలిచిన MNS, 2019 అసెంబ్లీ పోల్స్ లో ఒక సీటుకే పరిమితమైంది. 

నారాయణ్ రాణె కూడా శివసేన నుంచి కీలక సమయంలో తప్పుకున్నారు. 1999లో శివసేన -బీజేపీ 8నెలల ప్రభుత్వంలో సీఎంగా పని చేశారు. 2005లో శివసేన నుంచి రాణెను తొలగించారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగంతో పంపించేశారు. శివసేనలో టిక్కెట్లను అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేసి బయటికెళ్లిపోయారు. ఆ తర్వాత సీఎం పదవి హామీతో కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ కు ఆ స్కోప్ ఏర్పడకపోవడంతో మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష్ పార్టీ ఏర్పాటు చేశారు. దాన్ని 2019లో బీజేపీలో విలీనం చేశారు. అప్పుడే రాజ్యసభ కు ఎన్నికయ్యారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా పని చేస్తున్నారు.