స్నేహితుడి కడసారి చూపు కోసం.. కాలినడకన వెళ్లిన ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌

  • మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో టీచర్​ వెంకటయ్య అంత్యక్రియలకు హాజరైన చెన్నూరు ఎమ్మెల్యే

గండీడ్, వెలుగు: తన మిత్రుడిని కడసారి చూసేందుకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కాలినడకన పొలాలు, గట్లు దాటుకుంటూ వెళ్లారు. చివరి చూపు చూసి ఆయనకు నివాళులు అర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్ గ్రామానికి చెందిన టి.వెంకటయ్య (55).. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్ స్కూల్‌‌‌‌‌‌‌‌లో టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నారు. వెంకటయ్య, వివేక్ వెంకటస్వామి కొంతకాలంగా మిత్రులు.

టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాణిస్తూనే దళిత, బహుజన సామాజిక వర్గాల ప్రజలను వెంకటయ్య చైతన్యం చేసేవారు. అంబేద్కర్ విజ్ఞాన వేదిక వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, పీఆర్టీయూ స్టేట్ అసోసియేట్ అధ్యక్షుడిగా పని చేశారు. శనివారం ఆయన పరిగిలో గుండెపోటుతో మృతి చెందారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని స్వగ్రామమైన గాధిర్యాల్‌‌‌‌‌‌‌‌కు ఆదివారం తీసుకొచ్చారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్​లో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన వివేక్ వెంకటస్వామికి వెంకటయ్య మరణవార్త తెలిసింది. దీంతో ఆయన కార్యక్రమం ముగిసిన వెంటనే గాధిర్యాల్‌‌‌‌‌‌‌‌కు బయలుదేరారు.

అయితే, అంత్యక్రియలు జరిగే ప్రాంతం గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉండగా, అక్కడికి రోడ్డు మార్గం లేదని, అక్కడికి వెళ్లడం కష్టమని స్థానికులు చెప్పారు. అయినా.. వెంకటయ్యను కడసారి చూడాల్సిందేనని వివేక్​ బయలుదేరారు. కాలి నడకన పొలాలు, గట్లు దాటుకుంటూ వెంకటయ్య అంత్యక్రియలకు హాజరయ్యారు.  ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకు ముందు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెంకటయ్య భౌతికకాయం వద్ద  నివాళులు అర్పించారు.