కౌలు రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌‌కు లేదు

  • చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌‌ వెంకటస్వామి

హైదరాబాద్‌‌, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్‌‌ అధికారంలో ఉన్నప్పుడు కౌలు రైతులను అస్సలు పట్టించుకోలేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గతంలో కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలని అడిగాను. కానీ ఆనాడు కౌలు రైతులకు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. అందువల్ల ఇప్పుడు కౌలు రైతుల గురించి మాట్లాడే హక్కు, అర్హత బీఆర్ఎస్‌‌కు లేదు’’అని వివేక్ అన్నారు. సాగు చేయని పడావు భూములకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతుబంధు ఇచ్చామని కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారన్నారు. రైతులను మోసం చేసింది గత బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వమేనని మండిపడ్డారు. 

వరి వేస్తే ఉరే అన్నది కేసీఆర్ కాదా?:  పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు 

రైతులు వరి వేస్తే ఉరే అన్నది మాజీ సీఎం కేసీఆర్ కాదా అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలు సాగు చేస్తే బోనస్ ఇస్తుందని, రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలో గుట్టలు, ఖాళీ భూములకు రైతు బంధు ఇచ్చారని మండిపడ్డారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా రూ.లక్షల్లో రైతు బంధు తీసుకున్నారన్నారు. రైతు బంధు పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో పర్యటించి సలహాలు, సూచనలు తీసుకుందని ఆయన తెలిపారు.