ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం

  • ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య
  • ఆదిలాబాద్​లో బస్సు యాత్ర ప్రారంభం

ఆదిలాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం జరుగుతుందని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి చైర్మన్​ చెన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన బస్సు యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేకంగా నవంబర్ 24న హైదరాబాద్ లో జరిగే  భారీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. మాలలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను గ్రామాల్లో చర్చ పెట్టి ప్రజలకు వివరించాలన్నారు.

 రాజ్యాంగంలో అంటరాని కులాలన్నింటినీ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేదర్కర్ ఒకచోట చేర్చి షెడ్యూల్డ్ కులాలుగా ఉండి ఐక్యంగా హక్కులు సాధించాలని కోరుకున్నారని గుర్తుచేశారు. కానీ మంద కృష్ణ మాదిగ మనువాదులతో కుమ్మక్కై మనుధర్మ శాస్త్రం ప్రకారం మళ్లీ తాము కులాలుగా విడిపోతామని పోరాటం చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వర్గీకరణపై ఉన్న ఆసక్తి.. దళిత డిక్లరేషన్​పై లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్, ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి కో కన్వీనర్ తాళ్లపల్లి రవి, నాయకులు గోపోజు రమేశ్, నల్లాల కనకరాజు, బూర్గుల వెంకటేశ్వర్లు, రాంచందర్, రాములు, కిషన్, చెన్నకేశవులు పాల్గొన్నారు.