IPL 2025 Mega Auction: బౌలింగ్ పైనే గురి: అశ్విన్, షమీలపై కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2025 మెగా వేలంపై ఆసక్తి నెలకొంది. అన్ని జట్లు తమ ఆటగాళ్లను రిటైన్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. మరికొన్ని ఫ్రాంచైజీలు తమ జట్టును పటిష్టం చేసుకోవడానికి కొంతమంది బౌలర్లపై కన్నేశారు. ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025 సీజన్ లో తమ జట్టులో ఇద్దరు స్టార్ ఇండియన్ ప్లేయర్‌లను కొనుగోలు చేయాలని భావిస్తోందట. బౌలింగ్ విభాగంలో బలహీనంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి మెగా వేలంలో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, దిగ్గజ స్పిన్ బౌలర్ అశ్విన్ ను కొనాలని గట్టి ప్రయత్నాలు జరుపుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. 

అశ్విన్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. ప్రస్తుతం ఈ సీనియర్ ఆఫ్ స్పిన్నర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బౌలింగ్ లోనే కాకూండా బ్యాటింగ్ లో దంచి కొడుతున్నాడు. గతంలో చెన్నై తరపున ఆడిన అశ్విన్.. మరోసారి జట్టులో కలిస్తే సొంతగడ్డపై చెలరేగడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు షమీ గుజరాత్ టైటాన్స్‌ తరపున ఆడుతున్నాడు. 2023 లో ఐపీఎల్ టాప్ వికెట్ టేకర్ గా నిలిచిన షమీ.. గాయం కారణంగా 2024 ఐపీఎల్ ఆడలేదు. ఈ సారి మెగా ఆక్షన్ సమయానికి పూర్త ఫిట్ నెస్ తో అందుబాటులో ఉంటాడు. 

Also Read :- బంగ్లా ఓపెనర్ .. 24 బంతులాడి డకౌటయ్యాడు

ఈ సారి బీసీసీఐ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి ఫ్రాంచైజీలను అనుమతించే అవకాశం ఉంది. అయితే ఈ సారి రైట్ టు మ్యాచ్ కార్డ్ అందుబాటులో ఉండదు. దీంతో ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ చెన్నై  జట్టుతో ఉండడం ఖాయమైంది. మరో ఇద్దరి ప్లేయర్ల విషయంలో సందిగ్ధత నెలకొంది. శివమ్ దూబే, మతీషా పతిరనలను రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.