Team India: ఆడటం ఇష్టం లేకుంటే తప్పుకోండి.. డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ మాస్ బ్యాటింగ్

బాక్సిండ్ డే టెస్టులో టీమిండియా ప్రదర్శనపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన గెలిచే అవకాశాలను పక్కనపెడితే.. సునాయాసంగా 'డ్రా'తో సరి పెట్టుకోవచ్చు. అదీ లేదు. గంట ముందుగానే ఓటమిని అంగీకరించారు. ఇదిఎవరికీ రుచించడం లేదు. ఐపీఎల్ అనగానే యావత్ శక్తిని కూడబెట్టి పోరాడే మన ఆటగాళ్లు.. ఆసీస్ పర్యటనలో ఎందుకు తేలిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆడలేకపోతున్నారా..! లేదా ఆడటమే ఇష్టం లేదా! అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. 

మెల్‌బోర్న్ టెస్ట్ ఓటమి అనంతరం ఇదే విషయమై టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చ జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. భారత జట్టు పేలవ ప్రదర్శనపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పరిస్థితులు అర్థం చేసుకోకుండా అడ్డగోలు షాట్లు ఆడి ఔటయ్యే రిషభ్ పంత్ సహా సీనియర్లందరిపై గంభీర్ సీరియస్ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

పరిస్థితులకు తగ్గట్టు ఆడట్లేరు..

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గంభీర్ ఆటగాళ్ల పేర్లను ప్రస్తావించనప్పటికీ, కొందరు మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడకుండా వారి స్వంత ఆట శైలికి ప్రాధాన్యతనిస్తూ ఆడుతున్నారని విమర్శించినట్లు ప్రధాన వార్త. ప్రస్తుత భారత జట్టులో అటువంటి ఆడే వారు ఇద్దరే ఇద్దరు. పరిస్థితులు అర్థం చేసుకోకుండా వినూత్న షాట్లు ఆడి వికెట్ పారేసుకుని పంత్ ఒకరైతే.. ఆఫ్ సైడ్ బంతులను వేటాడి మరీ ఔటవుతున్న కోహ్లీ మరొకరు. వీరి ఆట పట్ల గంభీర్ ఏమాత్రం సంతోషంగా లేరని సారాంశం. మరోసారి ఇటువంటి ఆట రిపీట్ చేయొద్దని.. బాధ్యతాయుతంగా నడుచుకోవాలని గంభీర్ క్లాస్ తీసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 

ALSO READ | Nitish Reddy: ఏకంగా 20 మందిని వెనక్కినెట్టి.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నితీష్ రెడ్డి జోరు

ఆరు నెలలు స్వేచ్ఛనిచ్చా.. ఇక సహించేది లేదు

హెడ్ కోచ్‌గా గంభీర్  బాధ్యతలు చేపట్టిన నాటి సీనియర్ల విషయంలో అంటి ముట్టనట్లు వ్యవహరించారట. రాణించినా.. రాణించకపోయినా జట్టులో వారి పాత్ర ఏంటనేది తెలుసుకుంటారులే అన్నట్లుగా నడుచుకున్నారట. మున్ముందు జట్టులో అటువంటి వాటికి చోటులేదని గంభీర్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కొందరి మనసులు నొచ్చుకున్నా.. జట్టు ప్రయోజనాల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆటగాడిగా, కెప్టెన్‌గా రెండింటిలో విఫలమవుతోన్న రోహిత్ విషయంలోనూ గంభీర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.  

యశస్వి జైశ్వాల్ క్యాచ్‌లు జార విడచడం, బౌలర్లలో బుమ్రా మినహా పెద్దగా ఎవరూ స్థాయికితగ్గ ప్రదర్శన చేయకపోవడం వంటి అన్ని విషయాలపై గంటరన్నకు పైగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జట్టు ప్రయోజనాల దృష్ట్యా  ఇకపై స్వేచ్చా వాతావరణం ఉండదని గంభీర్ హెచ్చరించారట. ఆడనివారిపై తప్పకుండా వేటు పడుతుందని వార్నింగ్ ఇచ్చారట. మాజీ ఎంపీ ఎన్ని మాటలంటున్నా భారత క్రికెటర్ల నోటి వెంట చిన్న సమాధానం కూడా లేదని మరొక పత్రిక పేర్కొంది.