ప్రకాశం జిల్లా: ఒంగోలులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యం ఓ కుటుంబానికి వేదన మిగిల్చింది. ఒక కుటుంబానికి అప్పగించాల్సిన డెడ్ బాడీని మరో కుటుంబానికి అప్పగించారు. ఒంగోలు శివారు ప్రాంతంలో ఉన్న రమేశ్ సంఘమిత్ర హాస్పిటల్ లో ఈ ఘటన జరిగింది. కంభం ప్రాంతానికి చెందిన ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి కరోనాతో సంఘమిత్ర హాస్పిటల్ లో మరణించాడు. హాస్పిటల్ వర్గాలు ఖలీల్ డెడ్ బాడీని తీసుకువెళ్లాలంటూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో.. వారు హాస్పిటల్ వద్దకు వచ్చారు.
అయితే ఖలీల్ డెడ్ బాడీకి బదులు వీరయ్య అనే వ్యక్తి డెడ్ బాడీని ఇవ్వడంతో.. ఖలీల్ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గట్టిగా ప్రశ్నించగా, ఖలీల్ డెడ్ బాడీని అంతకుముందే వీరయ్య కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టు తెలిపింది హాస్పిటల్ యాజమాన్యం. మరింత ఆరా తీస్తే వీరయ్య కుటుంబ సభ్యులు ఖలీల్ మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించేశారని తేలింది. దీంతో ఖలీల్ కుటుంబం ఎంతో వేదనకు గురైంది. తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించిన ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం అధికారులకు విజ్ఞప్తి చేసింది.

