అరకు కాఫీపై చంద్రబాబు, భువనేశ్వరి ట్వీట్లు వైరల్..!

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి అరకు కాఫీ గురించి ట్విట్టర్లో ముచ్చటించటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అరకులో పర్యటిస్తున్న భవనేశ్వరి అక్కడ ఓ కాఫీ షాప్ వద్ద ఆగి కాఫీ టేస్ట్ చేస్తున్న ఫోటోను చంద్రబాబు ట్విట్టర్లో షేర్ చేస్తూ " మన గిరిజన సోదర సోదరీమణులు పండించిన కాఫీ ఎలా ఉంది భువనేశ్వరి" అంటూ ట్వీట్ చేశాడు.

చంద్రబాబు ట్వీట్ కి స్పందించిన భువనేశ్వరి " చాలా నచ్చిందండి, మన కిచెన్లో కూడా అరకు కాఫీ ప్యాకెట్స్ ఉన్నాయి కానీ, ఇక్కడ కాఫీ తాగుతుంటే టేస్ట్ చాలా బెటర్ గా ఉంది, బహుశా ఇక్కడి సీనరీస్, మన గిరిజన సోదరసోదరీమణుల అభిమానం వల్ల అయ్యుంటుందేమో" అన్నారు. అరకు కాఫీని మీరు ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినందుకు గర్వంగా ఉందని బాబుకి రిప్లై ఇచ్చారు.

నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో ఉన్న భవనేశ్వరి అరకులో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో స్థానిక టీడీపీ నేత దొన్ను దొర అరకు కాఫీ యొక్క విశిష్టత గురించి భువనేశ్వరికి వివరించారు. ఈ పర్యటనలో భువనేశ్వరి అక్కడి ప్రజలతో మాట్లాడుతూ అరకు ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కాఫీ తోటలను మరింత ప్రోత్సహిస్తామని అన్నారు.