2024 ఎన్నికల కోసం టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా రెడీ అయ్యింది. ఈ జాబితాను 14న ప్రకటించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తొలి జాబితాను జనసేనతో కలిసి ప్రకటించిన బాబు, ఇప్పుడు రెండో జాబితాను విడిగా ప్రకటిస్తామని తెలిపారు. జనసేన, బీజేపీ కూడా వారి జాబితాను విడివిడిగా ప్రకటిస్తాయని తెలిపారు. మొదటి జాబితాలో 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు రెండో జాబితాలో 25 నుండి 30 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను రేపు ప్రకటించనున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. 30ఏళ్ళు వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించాలంటే కేంద్రం సహకారం ఎంతో అవసరమని, అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.ఏపీలో టీడీపీ గెలిచినా కేంద్ర సహకారం లేకుంటే అభివృద్ధి కష్టమని అన్నారు. బీజేపీ, జనసేనతో సీట్ల సర్దుబాటు అంశంపై వైసీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ ను గద్దె దించటమే తమ ఉమ్మడి లక్ష్యమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే పవన్ నిర్ణయమని అన్నారు.