ఎన్డీయేతోనే మా ప్రయాణం : చంద్రబాబు

  •  అహంకారాన్ని ప్రజలు సహించరు
  •  మేం పాలకులం కాదు సేవకులం
  •  ఐదేండ్లలో 30 ఏళ్ల వెనక్కి వెళ్లాం
  •  ఇవి చారిత్రాత్మక ఎన్నికలు

అమరావతి: ఎన్డీఏతోనే తమ ప్రయాణం కొనసాగుతుందని, ఇవాళ ఢిల్లీలో జరిగే కూటమి సమావేశానికి వెళ్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఐదేండ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం 30 ఏండ్ల వెనక్కి వెళ్లిందని అన్నారు. మీడియా కూడా ఐదేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పారు. 

ప్రజాస్వామ్యమే సిగ్గుతో తల దించుకునే ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. ఎవరినైనా.. ఏదైనా చేయొచ్చని దాడులు చేశారని అన్నారు. విశాఖపట్నం వెళ్తే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను వెనక్కి పంపించేశారని అన్నారు.  కేసులు ఎందుకు పెట్టారని ఎవరైనా అడిగితే అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. అహంకారాన్ని ప్రజలు సహించరని.. ఈ ఎన్నికలతో మరో మారు రుజువైందని చెప్పారు. 

 ‘మేం పాలకులం కాదు.. సేవకులం’అనే నినాదంతో పనిచేస్తామని చెప్పారు. తమ మ్యానిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లిందని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీళ్లేదని పవన్‌ పట్టుబట్టారని, బీజేపీ కూడా కూటమిలో భాగస్వామ్యమైందని అన్నారు.  సమష్టి కృషితోనే అనూహ్య విజయం సాధించగలిగామని చంద్రబాబు చెప్పారు.  

చరిత్రాత్మక ఎన్నికలు

ఏపీ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ఇవి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలని చెప్పారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినపుడు 1983లో 200 సీట్లు వచ్చాయన్నారు. మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయని చెప్పారు. కూటమికి 55.38% ఓట్లు వచ్చాయని అన్నారు. 45.60% టీడీపీకి, 39.37 శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయని చెప్పారు. అవినీతి, అరాచకాలతో పనిచేసినందునే ఆ పార్టీకి ఇలాంటి గతి పట్టిందని అన్నారు.