ఉగాది పర్వదినాన రాష్ట్రంలోని వాలంటీర్లకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. తాము అధికారంలోకి రాగానే.. వాలంటీర్ల జీతం నెలకు రూ. 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను తాము కొనసాగిస్తామని, ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని తెలిపారు. ప్రస్తుతం వాలంటీర్లు రూ. 5 వేల గౌరవ వేతనం పొందుతున్నారు.
ఉగాది పండగ సందర్భంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "కొత్త ఏడాదిలో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకెళ్ళాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త ఏడాది మొదటి రోజు చైత్ర మాసంలో ప్రజా చైతన్యం కొత్తపుంతలు తొక్కుతూ, మన జీవితాలు ముందుకెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మేలు కలగాలని.. తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, ఇదే చంద్రబాబు.. గతంలో వాలంటీర్లను ఇంటింటికి వెళ్లి గొనె సంచులు మోసేవారంటూ విమర్శించారు. ఆ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఉన్నట్టుండి టీడీపీ అధినేత మనసు ఎందుకు మార్చుకున్నారంటూ వైసిపి నేతలు విమర్శిస్తున్నారు.
మే 13న ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. జగన్ సర్కార్ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి.