చెస్ లో దేవాన్ష్ మెరుపువేగం.. పావులు కదపడంలో వరల్డ్ రికార్డ్.. 

ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్ లో సత్తా చాటాడు.. వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు దేవాన్ష్. వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్ ప్రపంచ రికార్డును సాధించాడు దేవాన్ష్. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్న క్రమంలో నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

ఈ రికార్డ్‌లో దేవాన్ష్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్‌మేట్ పజిల్స్ ను సాల్వ్ చేశాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాంశ్ ఈ రికార్డును సాధించగలిగాడు. 

అంతే కాకుండా..  ఇటీవల దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1నిమి 43సెకన్లలో పూర్తి చేసి రికార్డ్ సాధించాడు దేవాన్ష్. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5నిమిషాల్లో అమర్చి.. మొత్తం 32 పావులు వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు.

9ఏళ్ళ వయసులోనే తనయుడు దేవాన్ష్ ఈ రికార్డ్ సాధించటం పట్ల ఆనందం వ్యక్తం చేసిన లోకేష్ దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం నేను ప్రత్యక్షంగా చూశానని... అతను గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుండి ప్రేరణ పొందాడని అన్నారు. దేవాన్ష్ కు చెస్‌ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి నేను ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు లోకేష్.