అమరావతి, వెలుగు:
ఏపీ మాజీ సీఎం చంద్రబాబును విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి రైతుల బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవడంపై చంద్రబాబు పార్టీ నేతలతో కలిసి బుధవారం సాయంత్రం 6 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్లో ఆందోళన చేపట్టారు. అక్కడి నుంచి విజయవాడ ఆటోనగర్‌కు పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన బెంజ్ సర్కిల్లోనే రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. తరువాత పోలీసులు చంద్రబాబు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీలు నారా లోకేశ్, రాజేంద్రప్రసాద్ తదితర టీడీపీ నేతలను అదుపులోకి తీసుకొని మంగళగిరి స్టేషన్ మీదుగా చంద్రబాబు ఇంటి వద్ద అందరిని వదిలేశారు. బాబు అరెస్టుకు నిరసనగా నందిగామ, మంగళగిరి, అమరావతి, చిలకలూరిపేటలో టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ల ఎదుట ఆందోళనలు చేశారు. నందిగామలో స్టేషన్ ఎదుట ఓ టీడీపీ కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు మాజీ ఎమ్మెల్యేతో తంగిరాల సౌమ్యతోపాటు కార్యకర్తలను అరెస్టు చేశారు.
అరెస్టుకు ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని తరలింపుపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. రెఫరెండంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఎక్కడ చెబితే అక్కడే రాజధాని పెట్టాలని కోరారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రజలు నిర్ణయిస్తే మూడు రాజధానుల పేరుతో తప్పుడు నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రాష్ట్రానికి ఓ శనిలా దాపురించారని విమర్శించారు. అభివృద్ధి చెందుతున్న అమరావతిని పిచ్చి ఆలోచనలతో నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు చట్టం పరిధిలో పనిచేయడం మాని జగన్ మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, ప్రభుత్వం మారితే తీవ్ర ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే పోలీసులు ఏం చేయలేరన్నారు. సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ పోతే ఏపీ గతి ఏమవుతుందన్నారు. అమరావతికి మద్దతుగా నిరసన చేస్తే కేసులు పెడతారని ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. కేసుల భయం లేకుంటే ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని ఎప్పుడో బంగాళాఖాతంలో కలిపేసే వారని అన్నారు. రాజధాని ఏమవుతుందో అన్న ఆవేదనతో ఇప్పటి వరకు ఆరుగురు రైతులు మృతి చెందారన్నారు. రాజకీయ లబ్ధి కోసం మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం ఆగిపోవడంతో పెట్టుబడులతో వచ్చే కంపెనీలన్నీ హైదరాబాద్ తరలిపోతున్నాయని పేర్కొన్నారు. జగన్ అమరావతి కోసం ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల్లో పాలన చేస్తే చాలని, టీడీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు బెంజ్‌సర్కిల్‌లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది.
