న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే.. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) చేరే సూచనలు కన్పిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ చీఫ్చంద్రబాబు నాయుడు భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూర్చుతున్నది.
గురువారం ఢిల్లీ పర్యటనకు వచ్చిన చంద్రబాబు నడ్డా, అమిత్ షాతో వరుసగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంపై చర్చలు జరిపినట్లు తెలిసింది. సీట్ల సర్దుబాటు అంశంపై బీజేపీ నాయకత్వంతో మాట్లాడారు. మరోవైపు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. గురువారం అర్ధరాత్రి తర్వాత పవన్ కల్యాణ్ సైతం అమిత్ షా తో భేటీ కానున్నట్లు సమాచారం.