పెన్షన్లు ఇళ్లకే పంపండి.. ఈసీకి చంద్రబాబు లేఖ...

ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై వార్ ముదురుతోంది. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్షాలు, సిటిజన్స్ డోర్ డెమాక్రసి వంటి సంస్థలు ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని రద్దు చేసింది ఈసీ. దీనిపై అధికార వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పేదలకు ఇంటి వద్దకు సంక్షేమ పథకాలు అందటం ఇష్టం లేకే వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం వద్ద నిధులు లేకే ఈ డ్రామా ఆడుతుందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈసీకి లేఖ రాసారు. పెన్షన్లు ఇళ్లకే పంపాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు బాబు. వలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ రద్దు వెనక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలు వస్తున్న క్రమంలో ఈ లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, పెన్షన్ల పంపిణీ కోసం ప్రత్యామ్నాయాల వాడుకోవాలన్న ఈసీ ఆదేశంతో ఏపీ ప్రభుత్వం సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయాల వద్దకు రాలేని వృద్దులు, వికలాంగులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటివద్దకు పంపాలని నిర్ణయించింది.