ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాల పంపిణీ కోసం వాలంటీర్లను వినియోగించద్దని ఈసీ అద్దేశాలిచ్చింది. సిటిజన్స్ ఫర్ డెమాక్రసి సంస్థ వేసిన పిటీషన్ మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈసి నిర్ణయాన్ని వైసీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదులా వెనుక చంద్రబాబు కుట్ర ఉందని, సిటిజన్స్ ఫర్ డెమాక్రసి సంస్థ అధ్యక్షుడిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. సదరు సంస్థ టీడీపీకి అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోందని అంటున్నారు వైసీపీ నాయకులు.
ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేస్తున్న వాలంటీర్లను అడ్డుకొని చంద్రబాబు ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ ఏపీ ఎన్నికల అధికారిగా ఉన్న సమయంలో కూడా నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు సూచనలతోనే నిమ్మగడ్డ వాలంటీర్లపై కేసులు వేశాడని అంటున్నారు. ఈసీ నిర్ణయం వల్ల వృద్దులు, వికలాంగులు చాలా ఇబ్బంది పడతారని, ఈ నిర్ణయాన్ని ఈసీ పునః సమీక్షించాలని కోరుతున్నారు. మరి, ప్రభుత్వ పథకాల పంపిణీలో వలంటీర్ల వినియోగంపై తన నిర్ణయాన్ని ఈసీ పునః సమీక్షిస్తుందా లేదా వేచి చూడాలి.