సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. పార్టీలన్నీ ప్రచారానికి సిద్దమైన క్రమంలో నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం యుద్ధభూమిని తలపిస్తోంది. జగన్ గద్దె దించటమే లక్ష్యంగా పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఒక పక్క, గత ఎన్నికల్లో సాధించిన భారీ విజయాన్ని రిపీట్ చేయాలని భావిస్తున్న వైసీపీ మరొకవైపు వెరసి రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ పీక్స్ కి చేరింది.
ఇదిలా ఉండగా బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.పొత్తు కోసం తాను వెళ్లలేదని, బీజేపీనే వచ్చిందని, తనకు కూడా కేంద్ర ప్రభుత్వంతో అవసరం ఉంది కాబట్టి ఈ పొత్తుకు ఒప్పుకున్నానని అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అమిత్ షా అపాయింట్మెంట్ కోసం పవన్ కళ్యాణ్ తో కలిసి ఢిల్లీలో రెండురోజుల పాటు పడిగాపులు కాసింది పొత్తు కోసం కాదా అని ప్రశ్నిస్తున్నారు.అసలే సీట్ల విషయంలో ఇరు పార్టీల క్యాడర్ తర్జనభర్జన పడుతున్న క్రమంలో బాబు చేసిన తాజా వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.