చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం నాడు (9వ తేదీ) తీర్పును వెలువరిస్తామని జడ్జి ప్రకటించారు. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు కూడా సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కోర్టులో ప్రభుత్వం తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు..
ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. గురువారం ( అక్టోబర్ 5) చంద్రబాబు, సీఐడీ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతికారంతో పిటిషనర్‌ను ఈ కేసులోకి లాగారని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించారు.రెండేళ్ల దర్యాప్తులో చంద్రబాబు పాత్రపై సీఐడీ ఒక్క ఆధారాన్నీ సేకరించలేకపోయింది అన్నారు. సీఐడీ డీజీ, అదనపు ఏజీ విచారణ ప్రక్రియను అపహాస్యం చేశారని.. స్కిల్ కేసులో ప్రెస్‌మీట్లు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. పిటిషనర్‌ను అవమానించేందుకు ఉన్న అవకాశాల్ని వారు వదల్లేదన్నారు. పిటిషనర్ ప్రోద్బలంతో ప్రాజెక్టు బడ్జెట్‌ను రూ.295 కోట్ల నుంచి రూ.333 కోట్లకు పెంచారనే ఆరోపణతో ఓ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చారన్నారు. ఇప్పటికే సాక్ష్యాధారాలను సీఐడీ సేకరించినందున పిటిషనర్‌కు బెయిలు మంజూరుచేయడం వల్ల దర్యాప్తునకు కలిగే ఇబ్బంది లేదన్నారు. బెయిలు ఇవ్వాలని కోరారు.
ప్రాథమిక విచారణలో చంద్రబాబు పేరు లేదు కాబట్టి కేసులో లేరనడం సరికాదన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేశాక చంద్రబాబు ప్రమేయాన్ని గుర్తించినట్లు కోర్టుకు వివరించారు. అందుకే ఆయన పేరును చేర్చామని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. టెరాసాఫ్ట్ పనులు ఇవ్వడం మొదలు అన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని అన్నారు. అందుకే చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయొద్దని న్యాయస్థానాన్ని కోరారు.
- ALSO READ | టీడీపీ నేత బండారు మనిషే కాదు.. ఖుష్బూ
రాష్ట్రవ్యాప్తంగా 22,500 కి.మీ. వరకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేశారన్నారు చంద్రబాబు తరఫు లాయర్ లూథ్రా. కేవలం 700 కి.మీ పరిధిలో నాసిరకం సామగ్రి వినియోగించినట్లు ఆడిట్ సంస్థ నిర్ధారించిందని.. ఈ వ్యవహారంతో పిటిషనర్‌కు సంబంధమేంటని ప్రశ్నించారు. పిటిషనర్‌కు బెయిలు మంజూరు చేసినంత మాత్రాన దర్యాప్తునకు ఎలాంటి అవరోధం కలగదన్నారు. సహేతుకమైన షరతులతో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది.