చంద్రబాబు రిమాండ్ 19వరకు పొడిగింపు

చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 19 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్, కస్టడీ  పిటిషన్ల విచారణను  విజయవాడ ఏసీబీ కోర్టు రేపటికి ( అక్టోబర్ 6) వాయిదా వేసింది. .  సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్, పొన్నవోలు వాదనలు వినిపించారు.  చంద్రబాడు తరపున ప్రమోద్‌కుమార్‌ దూబే వాదనలు వినిపించారు.   

చంద్రబాబు లాయర్

చంద్రబాబు తరఫున ప్రమోద్‌కుమార్‌ దూబే వాదిస్తూ స్కిల్‌ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసులో ఇరికించారు. డిజైన్‌ టెక్‌ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబు సీఎం హోదాలో మాత్రమే నిధులు మంజూరు చేశారు. ఒప్పందం ప్రకారం 40 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 2లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు. అంతా ఓపెన్‌గానే జరిగింది.. ఇందులో స్కామ్‌ ఎక్కడుంది?చంద్రబాబు పాత్ర ఏముంది?ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఆయన అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదు. సీఐడీ కస్టడీలో విచారణకు చంద్రబాబు సహకరించారు. మరోసారి ఆయన కస్టడీ అవసరం లేదు. విచారణ సాగదీయడానికే కస్టడీ పిటిషన్‌ వేశారు. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును కోరారు.   టీడీపీ బ్యాంక్ ఎక్కౌంట్ లావాదేవీలు సీఐడీ అధికారులు ఇచ్చారని  కోర్టుకు తెలిపారు.  పార్టీ ఎక్కౌంట్స్ ప్రజా ప్రతినిధుల చట్టం చూసుకుంటుందని కోర్టుకు చంద్రబాబు న్యాయవాది తెలిపారు.  ఈ లావాదేవీలు ఏప్రిల్ జరిగాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

సీఐడీ వాదనలు

సీఐడీ తరఫున పొన్నవోలు వాదనలు వినిపిస్తూ  ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయి. కేబినెట్‌ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదు. ఆ తప్పిదాలకు చంద్రబాబే బాధ్యుడు. బ్యాంకు లావాదేవీలపై ఇంకా ఆయన్ను విచారించాల్సి ఉంది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ చంద్రబాబుకు అప్లై అవుతుంది. కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.  టీడీపీ ఎక్కౌంట్లోకి స్కిల్ డెవలస్ మెంట్ నిధులు రూ. 27 కోట్లు మళ్లించారని పొన్నవోలు కోర్టుకు వివరించారు.  ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు  చంద్రబాబు రిమాండ్ ను 19 వరకు పొడిగిస్తూ... బెయిల్,కస్టడీ పిటిషన్  విచారణను రేపటికి ( అక్టోబర్ 6)  వాయిదా వేసింది.