జులైలో రూ.7 వేల పెన్షన్... బంపర్ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు

ఏపీలో పెన్షన్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్షాలు చేసిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. పెన్షన్ పంపిణీ రద్దుకు ప్రతిపక్షాలే కారణమని అధికార వైసీపీ విమర్శిస్తున్న నేపథ్యంలో టీడీపీ డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టింది.

పెన్షన్ ఇంటివద్దకు పంపాలని కోరుతూ ఈసీకి లేఖ రాసిన చంద్రబాబు తాజాగా అవ్వాతాతలకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న బాబు ఈ మేరకు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జులైలో రూ.7వేల రూపాయల పెన్షన్ ఇస్తామని సంచలన హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్ 4వేలకు పెంచుతామని ఇప్పటికే హామీ ఇచ్చిన బాబు, పెంచిన పెన్షన్ ప్రకారం తాను అధికారంలోకి వచ్చాక ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెరిగిన వెయ్యి కలిపి జులైలో 7వేల రూపాయలు ఇస్తామని అన్నారు.