వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భేటీ ముగిసింది. ఆదివారం (ఫిబ్రవరి 4) ఉండవల్లిలోని (Undavalli) చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. దాదాపు 3 గంటల పాటు ఈ అంశంపై చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు పూర్తి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి.?, ఏయే నియోజకవర్గాలకు సంబంధించి ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేసే అవకాశం ఉంది. ఇతర అభ్యర్థుల ఎంపికపైనా చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
జనసేనకు ఎన్ని సీట్లంటే.?
ఈ సమావేశంలో జనసేనకు 25 నుంచి 30 స్థానాలు కేటాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, తమవైపు నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ఉన్నారని.. ఇంకొన్ని స్థానాలు కేటాయించాలని పవన్ చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 50 శాతం షేర్ ఉండాలని జనసేన చెబుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. విశాఖలోనూ పార్టీ బలంగా ఉందని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, గత 4 రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేసిన ఇరువురు నేతలు ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు నచ్చచెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు ఆ పార్టీ అధిష్టానం హామీ ఇవ్వనుంది. అటు, టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు సద్ది చెప్పి వారి పొలిటికల్ కెరీర్ కు జనసేన అధిష్టానం హమీ ఇవ్వనుంది. సీట్ల అంశంపై ఇరు పార్టీల నేతలకు నచ్చజెప్పాక ఓ మంచి రోజు చూసుకుని స్థానాలను ప్రకటించేందుకు చంద్రబాబు, పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది
లెక్కలు తేలినట్టే..
ఈ సందర్భంగా.. ఎవరెవరు, ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ఇరుపక్షాల నేతలు చర్చించారని, దీనిపై దాదాపు ఓ క్లారిటీకి వచ్చారని తెలిసింది. టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి..? జనసేన ఎన్ని సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపాలి..? అనే విషయంపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్లేనని తెలియవచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సో.. దీన్ని బట్టి చేస్తే సీట్ల లెక్కలు తేలిపోయాయ్ అన్న మాట.
అంతా ఉమ్మడిగానే..
అలాగే.. ఇటీవల పొత్తుకు సంబంధించి వచ్చిన కామెంట్లపై కూడా చర్చ జరిగిందని సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభలపై కూడా ఏకాభిప్రాయానికి వచ్చారని.. వీటికి సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.
ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత @ncbn గారి నివాసానికి వెళ్లిన జనసేన పార్టీ అధ్యక్షుడు @PawanKalyan గారిని చంద్రబాబు గారు , అచ్చెన్నాయుడు గారు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు గారు , పవన్ కళ్యాణ్ గారు సమావేశమయ్యారు.#NaraChandrababuNaidu #PawanKalyan… pic.twitter.com/DwRZCoPgmk
— Telugu Desam Party (@JaiTDP) February 4, 2024