Champions Trophy 2025: భారత్ కోసం కీలక మార్పు.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు రెండు వేదికలు

వచ్చే ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఎనిమిదేళ్ల తరువాత దాయాది దేశం ఆతిథ్యమిస్తోన్న ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు పొరుగు దేశానికి వెళ్తుందా..! లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. భారత ప్రభుత్వం అంగీకారం తెలిపితేనే భారత జట్టు.. పాక్‌లో పర్యటిస్తుంది, లేదంటే లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, అది దాదాపు అసంభవమే. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు రెండు వేదికలు ఖరారు చేయనున్నట్టు సమాచారం. 

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు భారత్ చేరుకుంటే దుబాయ్ వేదికగా ఫైనల్ జరుగుతుంది. మరోవైపు భారత్ ఫైనల్ కు రాకుంటే పాకిస్థాన్ లోని లాహోర్ స్టేడియంలో జరగనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. లీగ్ దశలో భారత్ ఆడే మ్యాచ్ లన్ని దుబాయిలోనే ఆడుతుందట. 1996 ప్రపంచ కప్ తర్వాత పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న మొదటి గ్లోబల్ టోర్నమెంట్ ఇది. 

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, తీవ్రవాదం, కాశ్మీర్ అంశాల్లో వివాదం నడుస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వేదికగా జరిగే ఏ క్రికెట్ మ్యాచుల్లోనూ పాల్గొనటం లేదు ఇండియా జట్టు. 2023లో ఆసియా కప్ ను సైతం బహిష్కరించింది టీమిండియా. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే ఉంటుందని.. మార్పు ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే మరో ఏడు నెలల సమయం ఉండటంతో.. దౌత్యపరమైన చర్చల తర్వాత ఇండియా పాకిస్తాన్ వెళుతుందా లేదా అనేది వేచి చూడాలి.

పాక్ వేదికగా జరగనున్న ఈ మెగా ఈవెంట్ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు చేయనప్పటికీ.. ప్రతిపాదిత షెడ్యూల్ మాత్రం రిలీజ్ చేశారు. దీని ప్రకారం గ్రూప్ ఏ లో  పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్,న్యూజిలాండ్.. గ్రూప్ బి లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ మెగా టోర్నీ ఆడతాయి.