Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఫిబ్రవరి 23న ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్!

వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యుల్ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. 2025, ఫిబ్రవరి 19న టోర్నీ షురూ కానుండగా.. పాకిస్థాన్, యూఏఈ రెండు దేశాలు మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్‌ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనుండగా.. మిగిలిన మ్యాచ్‌లకు దాయాది దేశం ఆతిథ్యమివ్వనుంది. 

ఆదివారం (డిసెంబర్ 22) యూఏఈ క్రికెట్‌ బోర్డు అధికారి షేక్‌ నహ్యాన్‌ అల్‌ ముబారక్‌తో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) చీఫ్‌ మోహిసిన్‌ నఖ్వి చర్చలు జరిపారు. దాంతో, భారత్ మ్యాచ్‌లు దుబాయ్‌ వేదికగా జరగనున్నాయనేది స్పష్టమైంది. ఒకవేళ టీమిండియా నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తే.. యూఏఈలోనే సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఫిబ్రవరి 23న ఇండియా -  పాక్ మ్యాచ్!

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనున్నట్లు క్రిక్‍ఇన్ఫో నివేదించింది. భారత్, పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌ వేదికగానే జరిగే అవకాశం ఉంది.

ఈ టోర్నీలో దాయాది జట్టు ఫిబ్రవరి 19న న్యూజిలాండ్ తో కరాచీ గడ్డపై తలపడనుంది. ఇదే టోర్నీ ప్రారంభ మ్యాచ్. మార్చి 4, మార్చి 5 తేదీల్లో సెమీఫైనల్స్ ఉంటాయి. మార్చి 9న ఫైనల్ జరగనుంది. త్వరలోనే ఐసీసీ అధికారికంగా టోర్నీ పూర్తి షెడ్యూల్ ప్రకటించనుంది.

8 జట్లు.. 2 గ్రూప్‍లు

మొత్తం 8 జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడనుండగా.. వీటిని రెండు గ్రూప్‍లు విడగొట్టారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్ న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్‍బీలో అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఉన్నట్లు సమాచారం.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లు(అంచనా)

  • ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో
  • మార్చి 2న న్యూజిలాండ్‌తో
  • ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో