సవాల్ స్వీకరిస్తున్నా: ఒవైసీకి యోగి ఆదిత్యనాథ్‌ కౌంటర్

సవాల్ స్వీకరిస్తున్నా: ఒవైసీకి యోగి ఆదిత్యనాథ్‌ కౌంటర్

లక్నో: యూపీ ఎన్నికలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మళ్లీ గెలవనివ్వబోమంటూ ఒవైసీ కామెంట్ చేస్తే.. మీ సవాల్ ను స్వీకరిస్తున్నామంటూ యోగి కౌంటర్ ఇచ్చారు.
యోగిని సీఎం అవ్వనీయం: ఒవైసీ
యూపీలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ‘‘యోగి ఆదిత్యనాథ్ ను మళ్లీ సీఎం కానివ్వం. నిబద్ధతతో కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమే. యూపీలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాకూదన్నదే టార్గెట్’’ అని ఒవైసీ చెప్పారు.
300 పైగా సీట్లు గెలుస్తాం: యోగి
ఒవైసీ సవాల్ ను స్వీకరిస్తున్నామంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 403 ఎమ్మెల్యే సీట్లలో 300 పైగా బీజేపీ గెలిచి చూసిస్తుందంటూ రివర్స్ అటాక్ చేశారు. ‘‘ఒవైసీ పెద్ద జాతీయ నాయకుడు. ఆయన దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్తుంటారు. ప్రజల్లో ఆయనకంటూ ఒక క్రెడిబులిటీ ఉంది. ఆయన బీజేపీకి సవాల్ విసిరి ఉంటే.. దానిని స్వీకరించేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధమే. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఏ అనుమానం లేదు. బీజేపీ కేంద్ర నాయకత్వం 300 పైగా సీట్లలో గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. మేం కచ్చితంగా గెలుస్తాం కూడా’’ అని యోగి స్పష్టం చేశారు.