డీకే అరుణ ఆరోపణలు అర్థరహితం : చల్లా వంశీచంద్ రెడ్డి

పాలమూరు, వెలుగు: అవకాశం కోసం పూటకో పార్టీ మారే డీకే అరుణ తనపై ఆరోపణలు చేయడం తగదని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, కాంగ్రెస్  పార్టీ ఎంపీ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కాంగ్రెస్​ పార్టీ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు మహిళలంటే గౌరవమని, రాజకీయాల్లోకి వ్యక్తిగత జీవితాన్ని తీసుకురావడం ఇష్టం ఉండదన్నారు.

డీకే అరుణ తనను ఎమ్మెల్యే చేసిందన్న వ్యాఖ్యల్ని ఖండించారు. తనకు టికెట్  ఇచ్చింది రాహుల్ గాంధీ అని, కాంగ్రెస్  కార్యకర్తలు, కల్వకుర్తి ప్రజలు తనను గెలిపించారన్నారు. 2009 ,-2014 లో ప్రదేశ్  కాంగ్రెస్  ఎన్నికల కమిటీ సభ్యుడిగా తాను సిఫార్సు చేస్తేనే టికెట్  వచ్చిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. గద్వాలలో మీ కుటుంబ ప్రయోజనాల కోసం, అల్లుడిని ఎమ్మెల్యే చేయడానికి ఒక బీసీ బిడ్డను బలి పశువును చేశారని ఆరోపించారు. మక్తల్ లో బీజేపీ అభ్యర్థిని కాదని, నీ తమ్ముడికి అనుకూలంగా వ్యవహరించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు.

2014లో తన ఓటమికి డీకే అరుణ ప్రయత్నం చేసినా, ఆ కుట్రలను ఛేదించి కల్వకుర్తి ప్రజల ఆశీర్వాదంతో గెలిచానని చెప్పారు. ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నమ్మిన సిద్ధాంతం, పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానన్నారు. కల్వకుర్తి శేరి అప్పరెడ్డిపల్లిలో పుట్టానని, తాను ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డనన్నారు. గుజరాత్ కు చెందిన మోదీ వారణాసి నుంచి, హుజారాబాద్ కు చెందిన ఈటల మల్కాజ్ గిరి నుంచి ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు.

ఈ విషయంలో డీకే అరుణ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్  చేశారు. నారాయణపేటకు మంజూరైన సైనిక్  స్కూల్ ను వేరే రాష్ట్రానికి తరలిస్తే ఎందుకు అడ్డుకోలేదన్నారు. తన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్  విసిరారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ వినోద్ కుమార్, మీడియా సెల్  కన్వీనర్  సీజే బెనహర్, జహీర్ అక్తార్  పాల్గొన్నారు.