బీసీలు ఎదిగితే ఓర్వలేని డీకే అరుణను ఓడించండి : చల్లా వంశీచంద్ రెడ్డి

మక్తల్, వెలుగు: బీసీలు ఎదిగితే ఓర్వలేని డీకే అరుణను ఈ ఎన్నికల్లో ఓడించాలని కాంగ్రెస్  ఎంపీ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్ రెడ్డి కోరారు. ఆదివారం పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముదిరాజుల, గొల్ల కురుమల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ బిడ్డలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో శ్రీహరి, సరితకు ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చి ప్రోత్సహించిన ఘనత కాంగ్రెస్  పార్టీకే దక్కిందన్నారు. 

బలహీనవర్గాల ఎదుగుదల చూడలేని డీకే అరుణ కుట్రలు, కుతంత్రాలతో వాకిటి శ్రీవారి, సరితను ఓడించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ఆమెకు ప్రాంత ప్రయోజనాలు, ప్రజా సమస్యలు పట్టవని, స్వార్థ రాజకీయాల కోసం కుటుంబ ఎదుగుదల కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. గద్వాలలో తన మేనల్లుడు కృష్ణ మోహన్ రెడ్డిని గెలిపించుకొనేందుకు బీజేపీ అభ్యర్థి గొంతు కోసినప్పుడు, బీసీ ఆడపడుచు సరితను ఓడించినప్పుడు బీసీలు, మహిళలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. 

అరుణను గెలిపిస్తే గద్వాల అవినీతి, దోపిడీని  మహబూబ్ నగర్ కు విస్తరిస్తారే తప్ప అభివృద్ధి జరగదన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజులు, గొల్లకురుమల అభివృద్ధికి ఇచ్చిన హామీ నెరవేరుస్తారని తెలిపారు. చేతి గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జలంధర్ రెడ్డి, రవికుమార్ యాదవ్, బాలకృష్ణ రెడ్డి, కోళ్ల వెంకటేశ్, తులసీ రాజ్, కావలి శ్రీహరి పాల్గొన్నారు.