పాలమూరుకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేసిండు : వంశీచంద్ రెడ్డి

కేసీఆర్ కు రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాలను ఆంధ్రా  పాలకులు దోచుకుపోతుంటే దద్దమ్మ లాగా కేసీఆర్ చూస్తుండిపోయారని ఆరోపించారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్.. తొమ్మిదేళ్లయిన పూర్తి చేయలేదన్నారు. ప్రాజెక్టు పొడవునా నాసిరకం పనులు జరుగుతున్నాయన్నారు.  

కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపించారని వంశీచంద్ రెడ్డి మండిపడ్దారు. కృష్ణా నదిలో రావాల్సిన వాటాపై ఎందుకు పోరాటం చేయలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. నాడు కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉండుంటే 299 టీఎంసీలకు బదులుగా 577 టీఎంసీల వాటా వచ్చేదన్నారు.  కేసీఆర్ డిజైన్ చేసిన కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగిపోయిందని.. ఉత్తర తెలంగాణలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. దక్షిణ తెలంగాణనూ సైతం కేసీఆర్  మోసం చేశారన్నారు.