మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు భేష్​

  • కాంగ్రెస్​ ప్రభుత్వం మూడు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది : ప్రొఫెసర్ కంచె ఐలయ్య

హైదరాబాద్ సిటీ, వెలుగు: మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం గర్వించదగిన విషయమని, తన అప్పీల్ ను స్వీకరించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని  ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. మహబూబ్​నగర్​జిల్లా పూడూరులో దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ఆవరణలో ఆమె ఆరడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు.

 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాంస్కృతికపరమైన మూడు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నదన్నారు. మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం, గద్దర్ పేరుపై సినిమా అవార్డ్స్ ఇవ్వడం, వరంగల్ ఎయిర్​పోర్టుకు దొడ్డి కొమరయ్య పేరు నిర్ణయించడం అభినందనీయమన్నారు. ములుగు వద్ద కేంద్ర ప్రభుత్వం 250 ఎకరాల్లో సమ్మక్క సారక్క పేరుతో  వర్సిటీ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. పూడూరులో తాను మాట్లాడిన మాటలను కొన్ని ఛానల్స్​వక్రీకరించాయన్నారు.

వర్సిటీల్లో 18 మంది  మాత్రమే స్టాఫ్

తెలంగాణలోని యూనివర్సిటీల్లో కేవలం 18 మంది మాత్రమే పర్మినెంట్ స్టాఫ్ ఉన్నారని, మిగతా వారంతా కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్​ఉద్యోగులేనని కంచె ఐలయ్య అన్నారు. అలాంటి పరిస్థితి మహిళా యూనివర్సిటీకి రాకూడదన్నారు. అక్కడ పర్మినెంట్ స్టాఫ్ ఉండేలా చూసుకోవాలన్నారు. చాకలి ఐలమ్మ వర్సిటీకి ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో డబ్బులు ఇవ్వాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వారు కూడా తమ వంతు సాయాన్ని చెక్కుల రూపంలో ఇవ్వాలన్నారు. సంధ్య థియేటర్​ ఘటనను ప్రభుత్వం సీరియస్​గా తీసుకుని బెనిఫిట్ షోలను బ్యాన్ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.