ఆ గదిలో హత్యాచారమే జరగలేదా..? ఆర్జీకర్ హాస్పిటల్ కేసులో బిగ్ ట్విస్ట్

వెస్ట్ బెంగాల్: కోల్‎కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‎లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెంట్రల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ లాబొరేటరీ (CFSL) ఈ కేసుకు సంబంధించిన రిపోర్టును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి సమర్పించింది. సీఎఫ్ఎస్‎ఎల్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సంఘటనా స్థలంలో మరణించిన వ్యక్తికి దాడి చేసిన వ్యక్తికి మధ్య ఎలాంటి గొడవ లేదా దాడి జరిగినట్లు కనిపించలేదని.. జూనియర్ వైద్యురాలి డెడ్ బాడీ లభ్యమైన సెమినార్ గది నేరం జరిగిన ప్రదేశం కాకపోవచ్చు సీఎఫ్ఎస్‎ఎల్ నివేదికలో షాకింగ్ విషయాలు పేర్కొంది.

 సెమినార్‎ హాల్‎లో ఎక్కడ కూడా అత్యాచారం, హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లభించలేదని రిపోర్ట్‎లో పేర్కొన్నారు. ఎవరూ గుర్తించకుండా నిందితులు సెమినార్ హాల్‌లోకి ప్రవేశించి నేరం చేసే అవకాశం చాలా తక్కువ అని వెల్లడించారు. కాగా, 2024, ఆగస్ట్ 9వ తేదీన ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలు అత్యంత పాశవికంగా హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి అదే ఆసుపత్రిలో గార్డ్‎గా పని చేసే సంజయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 

అతడే జూడాపై అత్యాచారం చేసి హత్య చేశాడని కేసు నమోదు చేశారు. ఈ కేసు దేశవ్యా్ప్తంగా దుమారం రేపడంతో కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. పోలీసులు, సీబీఐ అధికారులు ఇద్దరూ.. నిందితుడు సంజయే అని తేల్చారు. సెమినార్ హాల్లోనే జూడాపై హత్యాచారం చేశాడని అభియోగాలు మోపారు. తాజా సీఎఫ్ఎస్ఎల్ రిపోర్టుతో ఈ కేసులో మరో మలుపు తిరిగింది. పోలీసులు, సీబీఐ దర్యాప్తుపై అనుమానాలు తలెత్తున్నాయి. 

ఇన్సిడెంట్ జరిగింది సెమినార్ హాల్‎లోనే.. నిందితుడు సంజయ్ రాయే అని పోలీసులు, సీబీఐ చెప్పగా.. సీఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. జూడా డెడ్ బాడీ లభ్యమైన సెమినార్ గదిలో ఎలాంటి నేరం జరిగిన ఆనవాళ్లు లభించలేదని సీఎఫ్ఎస్ఎల్ పేర్కొనడంతో ఈ కేసులో నెక్ట్స్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. సీఎఫ్ఎస్ఎల్ రిపోర్టుతో పోలీసులు, సీబీఐ విచారణపై అనేక కొత్త సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.