కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) లో అమ్మాయిలకు కూడా అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ఇవాళ(బుధవారం) జరిగిన విచారణలో సుప్రీంకోర్టుకు కేంద్రం ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే.. వారికి ప్రవేశాలు కల్పించేందుకుగానూ మార్గదర్శకాలను తయారు చేసేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరింది. దానికి అంగీకరించిన కోర్టు ఈ నెల 20లోపు తెలియజేయాలని ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు హర్షం వ్యక్తం చేసింది. NDA లోకి అమ్మాయిలను తీసుకునేందుకు సాయుధ బలగాలు ఒప్పుకోవడం ఆనందంగా ఉందని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. అమ్మాయిలను ఎన్డీయేలోకి తీసుకునే ప్రక్రియ, చర్యలకు కేంద్రం కొంత సమయం తీసుకోవచ్చని సూచించింది.
ఎన్డీయేతో పాటు నేవల్ అకాడమీలో అమ్మాయిలకూ అవకాశం కల్పించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఎన్డీయే పరీక్షను అమ్మాయిలూ రాయవచ్చని నెల క్రితం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
