రైతుల అప్పులపై మోదీ సర్కార్ ​స్పందించాలి

ఈ మధ్య కాలంలో  బీజేపీకి చెందిన శాసన సభ్యులు, పార్లమెంట్‌‌ సభ్యులు, కార్యకర్తలు...రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌‌ పార్టీ రైతులకు ఇచ్చిన రుణమాఫీ,  రైతు  భరోసా హామీలను వెంటనే అమలు చెయ్యాలని,  ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున ఒకరోజు రాష్ట్ర రైతుల కోసం దీక్ష చేపట్టినందుకు తెలంగాణ రైతుల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం.   దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్న రైతులు.. మన పాలకుల నిర్లక్ష్యంతో  ఈ రోజు పంట రుణాలు,  ప్రైవేట్​ అప్పులు దొరకకపోతే  వ్యవసాయం చెయ్యలేని పరిస్టితిని ఎదుర్కొంటున్నారు. ఇలా ఇంకెన్నాళ్లు ?   రైతులు  ప్రతిసారి  రుణమాఫీ డబ్బులు,  రైతు భరోసా డబ్బులు, పంట నష్ట పరిహారం డబ్బులు ఎప్పుడెప్పుడు తమఖాతాలో జమ చేస్తారో అని ఎదురు చూస్తుంటారు. - ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న తెలంగాణ రైతులకు కాంగ్రెస్​ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం  సంపూర్ణ  రుణమాఫీ,   రైతు భరోసా  అందిస్తే  రైతులకు ఆర్థికంగా ఎంతో  వెసులుబాటు లభిస్తుందని రాష్ట్ర బీజేపీ నాయకులు సహృదయంతో చేపట్టిన ఒకరోజు దీక్షతో -రైతులు బీజేపీ నాయకులపైన  ఆశలు పెంచుకొన్నారు.  బీజేపీ నేతలు రైతుల రుణమాఫీ విషయమై తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన స్ఫూర్తితో  రైతుల న్యాయమెన డిమాండ్లను  పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వంపైనా ఒత్తిడి తెస్తే  కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఒప్పుకుంటుందని విశ్వసిస్తున్నారు.  

కేంద్రం పరిధిలో  రైతుల ఆర్థిక అంశాలు

రైతుల ఆర్థిక పరిస్థితిని బాగుపరిచే అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నవి.  తెలంగాణలో రైతు సమస్యలపైన సంపూర్ణ అవగాహన కలిగిన, సమర్థులైన సీనియర్‌‌  బీజేపీ నాయకులు మనకు శాసనసభ్యులుగా,  పార్లమెంట్‌‌ సభ్యులుగా ఉన్నందున  రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే  కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని అంశాలకు శాశ్వత పరిష్కారం  లభించడానికి  కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తే  రైతుల హృదయాలలో స్థానం సంపాదించుకునే అవకాశం ఉంటుంది.  ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో  రైతులు ఆర్థికంగా బాగుపడడానికి చెప్పుకోతగిన ఒక్క చర్య కూడా  చేపట్టలేదు.  మెజారిటీ రైతులు పంట రుణాలతోబాటు, పైవేట్‌‌ అప్పులపాలై  అధిక వడ్డీ భారం మోయలేక  దిన దిన గండంగా రోజులు  గడుపుతున్నారు. మోదీ నాయకత్వంలో  మన దేశం ప్రపంచంలో 5వ ఆర్థికశక్తిగా ఎదిగినందుకు  భారతీయుడిగా గర్వంగా ఉన్నది.  కానీ,  దేశ జనాభాలో 50శాతానికి పైగా ఉన్న రైతులు,  వారి కుటుంబ సబ్యులకు పెరిగిన దేశ సంపదతో ఏమాత్రం మేలు జరగలేదు.  ఇప్పటికీ అన్నదాతలు అప్పులతో బతుకుతుంటే చాలా బాధ  కలుగుతున్నది.  

రైతు సమస్యలపై బీజేపీ నేతలు చిత్తశుద్ధితో పోరాడాలి

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెపుతున్న పథకం ‘ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి’ ఈ పథకం ద్వారా సంవత్సరానికి  6000 రూపాయలు పేద రైతులకు 
అందిస్తున్నారు.  ఇది ఒక్క రోజుకు కేవలం 16.48 రూపాయలు అవుతుంది.  ఇంత తక్కువ మొత్తంతో  రైతు  కుటుంబం రోజుకు ఒక కప్పు టీని కూడా  పాందడం చాలా కష్టం. రోజు ఒక్కంటికి ఇంత తక్కువగా సహాయం చెయ్యడం అంటే  ఇది రైతుల పేదరికాన్ని అవమానపరుస్తున్నట్లు కాదా?  రైతుల ఆర్థికస్థితిని శాసించే అనేక కీలక అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం  రుణమాఫీతో సహా తలకు మించిన ఎన్ని విన్యాసాలు చేసినప్పటికీ,  రైతుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావు. తెలంగాణ బీజేపీ నాయకులు సమష్టిగా  రైతుల జీవితాలు శాశ్వతంగా బాగుపడటానికి, వారి న్యాయమైన డిమాండ్లు, సమస్యలు ఏకకాలంలో పరిష్కరించడానికి పోరాడాలి.  కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినప్పుడు రైతులందరూ బీజేపీ నాయకులకు రుణపడి ఉంటారు. లేకపోతే  రాష్ట్రంలో రైతుల పేరిట రాష్ర్ట ప్రభుత్వంపైన ఒత్తిడి తేవడానికి ఎన్ని దీక్షలు చేపట్టినప్పటికీ ఇది కేవలం కాంగ్రెస్​ పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టి  రాజకీయంగా లబ్ధి  పొందడానికి ఆడుతున్న నాటకం అని అనుకోవాల్సి వస్తుంది. 

కేంద్రంపై  కాంగ్రెస్ ​ప్రభుత్వం ఒత్తిడి తేవాలి

రాష్ట్ర రైతులు,  దేశవ్యాప్తంగా రైతుల జీవితాలు బాగుపడడానికి రైతు సమస్యలన్నిటినీ ఏకకాలంలో పరిష్కరించాలని  బీజేపీ నాయకులు ఇదే స్ఫూర్తిని  ప్రదర్శించి చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాలని రైతులు తరఫున కోరుతున్నాం.  రాష్ట్ర  ప్రభుత్వం కూడా రైతులకు హామీ ఇచ్చినవిధంగా   రైతు రుణమాఫీ  కార్యక్రమం వీలైనంత త్వరలో మొదటి ప్రాధాన్యతతో  పూర్తి చేయాలని, కేంద్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లు వ్యవహరించకుండా కేంద్ర పరిధిలోని రైతు ఆర్థిక స్థితిని శాసించే అనేక అంశాలు వెంటనే  రైతుకు లాభం కలిగేలా అమలుచేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తేవాలని, రైతుల న్యాయమైన అన్ని డిమాండ్లను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టి, వాటిని వెంటనే పరిష్కరించాలని ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని లేకపోతే కేంద్ర ప్రభుత్వం మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రైతుల సమస్యల పట్ల అవగాహన లేదని భావించవలసి వస్తుంది. 

రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం

రైతు పండించిన పంటకు అయ్యే ఖర్చులను తక్కువగా లెక్కించి,  ప్రధాన పంటలన్నిటికి  క్వింటాల్​కు  వెయ్యి నుంచి మూడువేల రూపాయలకన్నా ఎక్కువగా ధర తగ్గించి ఎంఎస్​పీ  నిర్ణయించడంతో  రైతులు జీవితకాలం కష్టపడ్డప్పటికీ బాగుపడే అవకాశం లేదు.  ఉదాహరణకు రాష్ట్ర  ప్రభుత్వం 2024-25 సంవత్సరానికిగాను స్వామినాథన్‌‌ కమిషన్‌‌ సూచనల ప్రకారం సీఏసీపీ కమిటీకి వివిధ పంటలకు ఎంఎస్​పీ నిర్ణయించవల్సిందిగా సిఫార్సు చేసిన  రేట్లు,  కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నిర్ణయించిన  ఎంఎస్పీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

ఇంత తక్కువగా ఎంఎస్పీ ప్రకటించినప్పటికీ,  కనీసం  ప్రకటించిన ఎంఎస్​పీకి చట్టబద్ధత కల్పించడానికి  కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదు. అంటే,  బహిరంగ మార్కెట్‌‌ లో  ప్రకటించిన ఎంఎస్​పీ కంటే ధర తక్కువ ఉంటే తక్కువ ధరకే  రైతులు అమ్ముకుని రైతు నష్టపోతుంటే  తనకు సంబంధం లేదన్నట్టు  కేంద్ర  ప్రభుత్వం  వ్యవహరించడం ఎంతవరకు  సమంజసం?  పంటల బీమా పథకం సమర్థవంతంగా అమలుచేయడం లేదు.  ప్రతి సంవత్సరం పలు కారణాల వల్ల కోట్ల హెక్టార్ల పంటలు దెబ్బతింటున్నాయి.  ప్రతి సమయంలో తప్పులను  రాష్ట ప్రభుత్వాలపైన  తోసి తప్పించుకునే పద్ధతి  అవలంబించడంతో  రైతులు చాలా నష్టపోతున్నారు.  కోలుకోలేని విధంగా జరిగిన పంట నష్ట పరిహారం కోసం రైతులు ఎవరితో  చెప్పుకోవాలో తెలియని పరిస్థితి.  మోదీ  ప్రభుత్వం 2016వ సంవత్సరంలో  రైతుల ఆదాయాన్ని 2022 సంవత్సరం నాటికి రెట్టింపు చేస్తామని ప్రకటించి ఆ దిశలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా  దేశవ్యాప్తంగా  రైతులను మోసం చేసింది.  ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని చెపుతున్న మన దేశంలో గత 10 సంవత్సరాల కాలంలో రైతుల ఆర్థిక అభివృద్ధికి ఒక్క చర్యకూడా  చేపట్టకపోవడం ఎంతవరకు సమంజసం?  కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్‌‌ శక్తులు బ్యాంకుల మొండి రుణాలను  రద్దు చేసింది. కానీ,  రైతుల బ్యాంక్​ రుణాలను మాఫీ చేయడానికి ఇష్టపడటం లేదు. 

- పాకాల శ్రీహరి రావు,
తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు