బెంగాల్​పై కేంద్రం కుట్ర: సీఎం మమత

  • చొరబాటుదారులను బీఎస్ఎఫ్ ఆపట్లే


కోల్ కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులను బెంగాల్ లోకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అనుమతిస్తున్నదని ఆరోపించారు. ఇందుకు కొంతమంది కలెక్టర్లు, ఎస్పీలు కూడా సహకారం అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరగుతున్నదని, దీని వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉన్నదని ఆరోపించారు. 

చొరబాట్లను తీవ్రం చేసి, తమ సర్కార్ ను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతున్నదని మండిపడ్డారు. గురువారం కోల్ కతాలోని సెక్రటేరియెట్ లో అధికారులతో మమత రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఎస్ఎఫ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘‘ఇస్లాంపూర్, సిటాయ్, చొప్రా తదితర బార్డర్ ఏరియాల నుంచి బంగ్లాదేశ్ చొరబాటుదారులను బెంగాల్ లోకి బీఎస్ఎఫ్ అనుమతిస్తున్నదని మాకు సమాచారం ఉన్నది. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉన్నది” అని ఆరోపించారు. మహిళలను బీఎస్ఎఫ్ జవాన్లు వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 

ఢిల్లీలో ఇద్దరు బంగ్లాదేశీయులు అరెస్టు.. 

ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న ఇద్దరు బంగ్లాదేశీయులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశీయులను అక్రమంగా ఇండియాలోకి తీసుకొస్తున్న మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. నిందితులు అమీనూర్ ఇస్లాం, ఆశిష్ మెహ్రా ‘ఇమిగ్రేషన్ రాకెట్’ నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. 

బంగ్లాదేశ్ లోని హ్యాండ్లర్ల ద్వారా అస్సాం, మేఘాలయా లాంటి బార్డర్ స్టేట్స్ నుంచి బంగ్లాదేశీయులను అక్రమంగా మన దేశంలోకి తీసుకొస్తున్నారని.. వాళ్లు ఇక్కడ ఉండేందుకు ఫేక్ ఆధార్, పాన్ కార్డులు ఇస్తున్నారని చెప్పారు. కాగా, ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న మరో మహిళను కూడా పట్టుకుని, తిరిగి బంగ్లాదేశ్ కు పంపించినట్టు పోలీసులు వెల్లడించారు.