కొవిషీల్డ్ ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి కోరిన సీరమ్
ఇప్పటికే భారత్ బయోటెక్, ఫైజర్‌ల అప్లికేషన్ ఆక్స్‌ఫర్డ్‌కు ఓకే చెప్పి న బ్రిటన్ ..
ఈ టీకావైపే కేంద్రం మొగ్గు
రేటు తక్కువ, స్టోరేజీ ఈజీగా ఉండటంతోనే..
ఈ మూడు టీకా డేటాలను అనలైజ్ చేస్తున్న ఎక్స్‌పర్స్ట్ కమిటీ
వ్యాక్సిన్ అనుమతిపై రేపటి మీటింగ్ లో నిర్ణయం
న్యూఢిల్లీ/లండన్: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ స్టార్టవడం, కొన్ని దేశాల్లో రెండేసి వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చేయడంతో మన దేశంలోనూ వ్యాక్సిన్ అనుమతిపై కేంద్రం ఫోకస్ చేసింది. బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు అనుమతి రావడంతో మనదగ్గర కూడా దాని వాడకానికి రూట్ క్లియరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫైజర్‌తో పోలిస్తే రేటు తక్కువగా ఉండటం, స్టోరేజీ కూడా సులువుగా ఉండటంతో కేంద్రం కూడా ఆక్స్‌ఫర్డ్ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో ఆస్ట్రాజెనికా ఉత్పత్తి చేస్తున్న ఈ టీకాను దేశంలో కొవిషీల్డ్ పేరుతో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. ఈమధ్య టీఆకా అత్యవసర వాడకానికి అనుమతి కోసం కేంద్రానికి అప్లై చేసింది. భారత్ బయోటెక్, ఫైజర్ కూడా ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకున్నాయి.
సీరమ్‌తో ఆస్ట్రాజెనికా ఒప్పందం
ఆక్స్‌ఫర్డ్ టీకా డోసులు 100 కోట్లు ఉత్పత్తి చేయడానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో ఆస్ట్రాజెనికా ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం వచ్చే ఏడాది 300 కోట్ల డోసులను ఆస్ట్రాజెనికా రెడీ చేయనుంది. సుమారు రూ. 200కే ఒక్కో డోసును అందించనుంది. పైగా మిగతా వ్యాక్సిన్లలా మైనస్ డిగ్రీల టెంపరేచర్లలో కాకుండా 2 నుంచి 8 డిగ్రీల్లో స్టోర్ చేయొచ్చు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పటికే 4 నుంచి 5 కోట్ల వ్యాక్సిన్ డోసులను రెడీ చేసింది. వీటిని దేశంలోనే అమ్మనుంది. నెలకు 5 నుంచి 6 కోట్ల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం సీరమ్ దగ్గర ఉంది. దీన్ని మార్చి కల్లా 10 కోట్లకు పెంచాలనుకుంటోంది.
బ్రిటన్‌లో రెండో వ్యాక్సిన్‌కూ ఓకే
కొత్త రకం కరోనాతో సతమతమవుతున్న బ్రిటన్ తాజాగా ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టులు డెవలప్ చేసిన వ్యాక్సిన్ వినియోగానికి బుధవారం ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్‌కు సంబంధించిన ఫైనల్ డేటాను బ్రిటన్ రెగ్యులేటర్ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీకి ప్రభుత్వం అందించగా ఆ సంస్థ పరిశీలించి ఓకే చేసింది. ఆస్ట్రాజెనికా ఉత్పత్తి చేస్తున్న ఈ టీకాను జనవరి 4 నుంచి పంపిణీ చేయనున్నట్టు ఆ దేశ హెల్త్ సెక్రటరీ తెలిపారు.
రెండో స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో..
డిసెంబర్ తొలివారంలోనే ఫైజర్-–బయోఎన్‌టెక్ టీకాను యూకే సర్కారు ఆమోదించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆ దేశంలో 6 లక్షల మందికి పైగా మంది టీకా వేయించుకున్నారు. అయితే అక్కడ కొత్తరకం కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 20 వేలకు పైగా కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో ఆక్స్‌ఫర్డ్ టీకాను అత్యవసరంగా బ్రిటన్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 10 కోట్ల డోసులను ఆర్డర్ చేసింది. 4 కోట్ల డోసులు వచ్చే ఏడాది మార్చి చివరికల్లా రానున్నాయి. ఫైజర్ లాగానే రెండు డోసులుగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఫైజర్ తొలి డోసు తీసుకున్న వాళ్లకు 4 వారాల్లో రెండో డోస్ ఇస్తుండగా తాజాగా ఫైజర్, ఆక్స్‌ఫర్డ్ రెండో డోసులను 12 వారాల్లో ఇవ్వనున్నట్టు అధికారులు చెప్పారు.
