నీటి పొదుపు, భూగర్భ జలాల పెంపుపై కేంద్రం ఫోకస్

  • ‘జల్ సంచయ్ జన్ భగీదారి’కి శ్రీకారం 
  • రాష్ట్రంలో కార్యక్రమ వివరాలుఅప్లోడ్ చేయాలని సూచన

హైదరాబాద్, వెలుగు : జలశక్తి అభియాన్ లో భాగంగా కేంద్రం ‘జల్ సంచయ్ జన్ భగీదారి’ కార్యక్రమానికి  శ్రీకారం చుట్టింది. తొలుత గుజరాత్ లో ప్రారంభించింది. నీటి పొదుపు, భూగర్భ జలాలను పెంచడానికి రాష్ట్రాలను భాగస్వామ్యం చేస్తున్నది. ఇందులో భాగంగా కృత్రిమ రీఛార్జీ నిర్మాణాలు, బోర్​వెల్ రీఛార్జీ, ఇంకుడు గుంతలు, క్యాచ్ ది రెయిన్ క్యాంపెయిన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. నీటిని సంరక్షించేందుకు టెక్నాలజీని ఉపయోగించాలని కోరింది. తద్వారా నీటి ఎద్దడిని అధిగమించేలా చర్యలు చేపట్టాలని చెప్పింది.

మిషన్ మోడ్‌‌‌‌‌‌‌‌లో రీఛార్జ్ నిర్మాణాలు

‘జల్ సంచయ్ జన్ భగీదారి’కార్యక్రమంలో భాగంగా  వర్షపు నీటిని మిషన్ మోడ్‌‌‌‌‌‌‌‌లో సంగ్రహించడం, నిల్వ చేయడానికి అన్ని గ్రామాల్లో కనీసం ఐదు రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టాలి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10 వేల రీఛార్జ్ నిర్మాణాలు చేయాలి.వీటికి మద్దతు ఇవ్వడానికి ప్రస్తుత కేంద్ర పథకాలను ఉపయోగించుకోవాలని రాష్ట్రాలను కేంద్రం రిక్వెస్ట్ చేసింది. యాక్షన్ ప్లాన్ లోని రీఛార్జ్ నిర్మాణాలను జేఎస్జేబీ పోర్టల్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాలని కోరింది. జిల్లాల్లో జల్ సంచయ్ డ్యాష్‌‌‌‌‌‌‌‌బోర్డ్​లో వీటి పురోగతిని అప్ లోడ్ చేయడం లేదని కేంద్రం దృష్టి కెళ్లింది.

దీంతో  రాష్ట్ర నోడల్ అధికారులందరూ తమ జిల్లాల్లో పురోగతిని సమీక్షించాలని కేంద్రం కోరింది. జల్ సంచయ్ డ్యాష్‌‌‌‌‌‌‌‌బోర్డ్‌‌‌‌‌‌‌‌లో (https://sactr.mowr.gov.in/JSJB.aspx) లో డేటాను ఎప్పటికప్పుడు  అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాలని సూచించింది. తెలంగాణలో 12,854 గ్రామాలు ఉండగా.. మొత్తం 64,270 పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. 14,073 పనులు  చేపట్టారు. 7092 పనులు పూర్తి అయ్యాయి.