వరదలపై నివేదిక ఇవ్వండి

  • రాష్ట్ర సర్కార్​కు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ఇటీవల సంభవించిన వరదలపై ఇప్పటి దాకా కేంద్ర హోంశాఖ కంట్రోల్ రూంకు ఎలాంటి నివేదిక అందలేదని కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో భారీ వర్షం, వరదలతో పలు జిల్లాలు నీట మునిగినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (ఎస్ఈఓసీ) నుంచి ఫోన్ కాల్ మాత్రమే వచ్చిందని తెలిపింది. రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ కోసం బోట్లతో పాటు ఏడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెండు వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లను తెలంగాణకు పంపినట్లు కేంద్రం తెలిపింది.

స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) కింద నిధులు కావాలంటే.. ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల వివరాలు, వాటి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, వరద నష్టం వివరాలను నిర్ణీత ఫార్మాట్​లో పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం సీఎస్ శాంతి కుమారికి సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్​మెంట్ డైరెక్టర్ అశిష్ వి గవాయి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద ఎస్డీఆర్ఎఫ్ కింద రూ.1,345 కోట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

కేంద్ర వాటా కింద ఎస్డీఆర్ఎఫ్ నిధులు రిలీజ్ చేసేందుకు కావాల్సిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించలేదని గవాయి లేఖలో పేర్కొన్నారు. ఎస్డీఆర్ఎఫ్ స్కీంలో ప్రతియేటా ఏప్రిల్, అక్టోబర్ లో కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల వివరాలను నిర్ణీత ఫార్మాట్ లో అందించాల్సి ఉంటుందని తెలిపారు. 2022–2023 ఏడాదికి గాను మొదటి విడతలో భాగంగా రూ.180.80 కోట్లు, 2023–24 ఏడాదికి గాను రూ.198 కోట్లు రిలీజ్ చేసినట్లు వివరించారు. అయితే, 2024–25కు గాను కేంద్ర వాటా కింద రూ.208 కోట్లకు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి విజ్ఞప్తి రాలేదని లేఖలో ప్రస్తావించారు.