పత్తి  కొనుగోళ్లలో  సీసీఐ దూకుడు

  • ప్రైవేటు వ్యాపారులను కాదని సీసీఐకు అమ్ముతున్న రైతులు 
  •  ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో1.10  లక్షల క్వింటాళ్ల పత్తి కొన్న సీసీఐ
  •  75 వేల క్వింటాళ్లు కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యాపారులు
  •  మద్దతు ధర రావడంతో సీసీఐ వైపే రైతుల మొగ్గు 

కరీంనగర్/జమ్మికుంట, వెలుగు : జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో ఈ సీజన్ లో  ప్రైవేటు వ్యాపారులను మించి సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపట్టింది.  డిసెంబర్ 17 వరకు 6,442 మంది రైతుల నుంచి  1,10,172 క్వింటాళ్ల పత్తిని సీసీఐ ఆఫీసర్లు కొనుగోలు చేశారు.  రైతులకు  రూ.81.99 కోట్లు చెల్లించారు.   నిరుడు సీజన్ మొత్తం కలిపి 70 వేల క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయగా ఈ సారి నవంబర్ 17 నుంచి డిసెంబర్ 17 వరకు నెల రోజుల్లోనే లక్ష క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయడం గమనార్హం. 

ధర తగ్గించిన ప్రైవేట్ వ్యాపారులు.. 

కొత్త పత్తిని రైతులు అమ్మేందుకు తీసుకొస్తున్నా... తేమ, నాణ్యత లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకు కొనుగోలు చేయడంలేదు.  పత్తి క్వింటాళ్లకు సీసీఐ మద్దతు ధర రూ.7,521గా ఉండగా.. ప్రైవేట్ వ్యాపారులు 500, రూ.1000 తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి అమ్మేందుకు తరలివస్తున్నారు. అందుకే ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసిన పత్తి 75 వేల క్వింటాళ్లకు మించలేదు.

తేమ శాతం 8 నుంచి 12 శాతం వరకు ఉన్నప్పటికీ సీసీఐ అధికారులు ఎలాంటి కొర్రీలు పెట్టకుండ కొనుగోలు చేస్తున్నారు. జమ్మికుంట జిన్నింగ్ మిల్లులలో తయారైన పత్తి బేళ్లను ఎక్కువగా కర్ణాటక రాష్ట్రానికి తరలించారు. అంతర్జాతీయ మార్కెట్ లో పత్తి బేళ్లకు డిమాండ్ పెరగడంతో  సీసీఐ కూడా భారీగా పత్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ వరకు పత్తి నిల్వలు మరింత రావొచ్చని అంచనా వేస్తున్నారు. 

ఉమ్మడి జిల్లాలో 4.80 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు..

మద్దతు ధర కంటే చాలా తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులు పత్తి కొనుగోలు చేస్తుండడంతో  పత్తిని మద్దతు ధరకు ఖరీదు చేసేందుకు సీసీఐ ఉమ్మడి జిల్లాలో 18 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసింది. నిబంధనలను సడలించడంతో సీసీఐ కేంద్రాల్లో  కొనుగోళ్లు పెరిగాయి. దీంతో ప్రైవేట్ వ్యాపారులు కూడా కొంత ధర పెంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా సీసీఐ, ప్రైవేట్ వ్యాపారులు కలిపి ఈ నెల 17 వరకు 4,80,039 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా..

ALSO READ : కొత్తగా రెండు కార్పొరేషన్లు.. మహబూబ్ నగర్, మంచిర్యాల ఏర్పాటు: అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన

ఇందులో కరీంనగర్ జిల్లాలో 2,17,158 క్వింటాళ్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో  1,52,815 క్వింటాళ్లు, పెద్దపల్లి జిల్లాలో  98,336 క్వింటాళ్లు, జగిత్యాల జిల్లాలో 11,730 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. 

మద్దతు ధరకు పత్తి అమ్మిన

ఈ ఏడాది పండించిన పత్తి పంటను సీసీఐకి అమ్మిన. గతంలో రూ.6,200 నుంచి రూ.6,500 వరకు మాత్రమే క్వింటాళ్లకు పత్తి ధర వచ్చేది. ఈ సారి ప్రైవేటు వ్యాపారులను కాదని సీసీఐకి పత్తిని అమ్మిన. క్వింటాకు రూ.7300 చొప్పున సీసీఐ వాళ్లు కొన్నారు. గతంలో కంటే కూడా ఈసారి క్వింటాలుకు రూ.800 ఎక్కువ రావడం సంతోషంగా ఉంది. మిగిలిన పత్తిని కూడా సీసీఐకే అమ్మాలనుకుంటున్నా. - ఎనగంటి శ్రీనివాస్, ఇల్లందకుంట

సీసీఐ వైపే రైతుల మొగ్గు

జమ్మికుంట పత్తి మార్కెట్ లో సీసీఐ కొనుగోళ్లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమయ్యాయి. మొదట రైతులు సీసీఐ కొనుగోళ్లపై ఆసక్తి చూపలేదు. తర్వాత ప్రైవేట్ వ్యాపారులు ధర తగ్గించడంతో రైతులంతా సీసీఐ కొనుగోలు కేంద్రానికి వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీఐ ఇప్పటివరకు 1,10,000 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది.  మరో నెల రోజులు సీసీఐ ఇంకా భారీగా పత్తి కొనుగోలు చేయనుంది.

- మల్లేశం, జమ్మికుంట మార్కెట్ సెక్రటరీ  

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు ఇలా.. (క్వింటాళ్లలో)  

కరీంనగర్    2,17,158
సిరిసిల్ల       1,52,815
పెద్దపల్లి      98,336
జగిత్యాల     11,730