రేంజల్‌‌ కస్టడీ డెత్‌‌లో సీసీ ఫుటేజీలే కీలకం

  • బాలిక బంధువులే హత్య చేశారంటున్న మృతుడి కుటుంబసభ్యులు
  • ఉరి వేసుకున్నారని కేసు నమోదు
  • తండాలో భారీబందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

నిజామాబాద్‌‌, వెలుగు : నిజామాబాద్‌‌ జిల్లా రెంజల్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌లో రెడ్యానాయక్‌‌ మృతి ఘటన పోలీస్‌‌ కస్టడీ డెత్‌‌గా మారింది. ఈ ఘటనలో ఇప్పటికే వాచ్‌‌ పీసీ ప్రసాద్‌‌ను సస్పెండ్‌‌ చేయగా, ఎస్సై సాయన్న, హెడ్‌‌ కానిస్టేబుల్‌‌ లక్ష్మణ్‌‌, పీసీ లింబాద్రికి మెమో జారీ చేశారు. రెడ్యానాయక్‌‌ మృతి పట్ల భిన్న వాదనలు వినిపిస్తుండడం, కస్టడీ డెత్‌‌ కోణంలో విచారణ నడుస్తున్నందున కలెక్టర్‌‌ నేతృత్వంలో మెజిస్టీరియల్‌‌ ఎంక్వైరీ ప్రారంభం కానుంది.

కీలకంగా మారిన సీసీ ఫుటేజీ

బాలిక బంధువులే తెల్లవారుజామున పోలీస్‌‌ స్టేషన్‌‌కు వెళ్లి రెడ్యానాయక్‌‌ను హత్య చేశారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా, నైట్‌‌ ప్యాంట్‌‌ నాడాతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అసలు స్టేషన్‌‌లో ఏం జరిగిందో తెలియాలంటే అక్కడి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించాల్సి ఉంది. రేంజల్‌‌ ఠాణాలో మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలు ఉన్నాయి. 

ఒక్క ఎస్సై గది మినహా అన్ని వైపులా కెమెరాలు ఉన్నాయి. రెడ్యానాయక్‌‌ చనిపోయిన బ్యారక్‌‌ పక్కన కూడా ఓ కెమెరా ఉంది. అందులోని ఫుటేజీని బయటకు తీస్తేగానీ అసలు విషయం తెలిసే అవకాశం లేదు. ఫుటేజీని సేఫ్‌‌ చేసే బాధ్యతను విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న తూఫ్రాన్‌‌ డీఎస్పీ వెంకట్‌‌రెడ్డికి అప్పగించారు. అవసరమైతే పూడ్చిన డెడ్‌‌బాడీని సైతం బయటకు తీసి మరోసారి రీపోస్ట్‌‌మార్టం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

తండాలో టెన్షన్‌‌, టెన్షన్‌‌

రెడ్యానాయక్‌‌ మృతి ఘటనతో వీరన్నగుట్లతండాలో టెన్షన్‌‌ వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక తండావాసులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనను అవకాశంగా తీసుకొని కొందరు రాజకీయ కక్ష తీర్చుకునేందుకు కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.