సీబీఐ ఇన్స్‎స్పెక్టర్ రాహుల్ రాజ్ అవార్డ్ రద్దు

న్యూఢిల్లీ: అవినీతి కేసులో అరెస్ట్ అయిన సీబీఐ ఇన్‌స్పెక్టర్ రాహుల్ రాజ్‎కు మరో బిగ్ షాక్ తగిలింది. ఉత్తమ సేవలకు గానూ 2023లో రాహుల్ రాజ్‎కు ప్రధానం చేసిన అవార్డును కేంద్ర హోం మంత్రిత్వశాఖ రద్దు చేసింది. ఈ మేరకు 2024, డిసెంబర్ 31 ఒక ప్రకటన విడుదల చేసిన హోం మినిస్ట్రీ..  అవినీతి కేసులో పట్టుబడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. 

అసలేం జరిగిందంటే..?

కాగా, మధ్యప్రదేశ్‎లోని  నర్సింగ్ కాలేజీల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకుండా విద్యార్థుల ప్రాణాలతో చలగాటమాడుతూ కాలేజీలు నిర్వహిస్తున్నారని ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన హైకోర్టు.. రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల్లో తనిఖీలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ కాలేజీల్లో సోదాలు నిర్వహించింది. తనిఖీల తర్వాత నర్సింగ్ కాలేజీలకు అనుకూలంగా రిపోర్టులు ఇచ్చేందుకు కాలేజ్ మేనేజ్మెంట్ నుండి సీబీఐ అధికారులు కొందరు రూ.2 లక్షల నుండి 10 లక్షల వరకు లంచం డిమాండ్ చేశారు. 

ALSO READ | దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం..ఎక్కడంటే.?

ఈ క్రమంలోనే మలయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాల ఛైర్మన్ అనిల్ భాస్కరన్, అతని భార్య సుమ నుండి సీబీఐ ఆఫీసర్ రాజ్ కుమార్‎ రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా భోపాల్ యాంటీ క్రైమ్ బ్యూరో, ఢిల్లీకి చెందిన సీబీఐ విజిలెన్స్ టీమ్ రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు. ఈ మేరకు రాజ్ కుమార్‎పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అంతేకాకుండా తక్షణమే రాజ్ కుమార్‎ను సీబీఐ విధుల నుండి తొలగించింది. ఇదిలా ఉండగానే.. రాజ్ కుమార్‎కు 2023లో ప్రదానం చేసిన అవార్డ్‎ను కూడా తాజాగా హోంశాఖ రద్దు చేసింది.