సైబర్ క్రిమినల్స్ కోసం ఆపరేషన్‌‌ చక్ర 3

  • హైదరాబాద్‌‌, విశాఖ, పుణె, అహ్మదాబాద్‌‌లో సీబీఐ సోదాలు 
  • 26 మంది నిందితుల అరెస్ట్‌‌.. కంప్యూటర్స్‌‌ హ్యాక్ అయ్యాయంటూ మెసేజ్​లు
  • తాము చెప్పిన అకౌంట్స్‌‌లోకి డబ్బు వేయాలని కాల్స్
  • విదేశాల్లో నివాసం ఉండే వారే టార్గెట్​గా మోసాలు

హైదరాబాద్‌‌, వెలుగు: విదేశాల్లో ఉంటున్న వారిని టార్గెట్ చేసిన మోసాలకు పాల్పడుతున్న సైబర్‌‌ క్రిమినల్స్​పై సీబీఐ ఫోకస్ పెట్టింది. కంప్యూటర్స్‌‌ హ్యాక్ అయ్యాయని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న కాల్ సెంటర్స్‌‌పై మెరుపు దాడులు చేసింది. ‘ఆపరేషన్‌‌ చక్ర-3’ పేరుతో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో సెర్చ్‌‌ ఆపరేషన్స్ నిర్వహించింది. హైదరాబాద్‌‌లోని వయోజెక్స్‌‌ సొల్యూషన్స్‌‌, పుణె, విశాఖపట్నం, అహ్మదాబాద్‌‌లో గురువారం(ఈ నెల26 నుంచి 29 వరకు) నుంచి ఆదివారం వరకు సోదాలు చేసింది. 26 మంది కీలక నిందితులను అరెస్ట్ చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌‌టాప్‌‌లు, కమ్యూనికేషన్ రికార్డులు సహా మొత్తం 951 వస్తువులు, రూ.58.45 లక్షల నగదు, లాకర్ కీస్‌‌, మూడు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ వివరాలను సీబీఐ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

కంప్యూటర్ హ్యాకైందని ఫారినర్స్‌‌కు కాల్స్‌‌

విదేశాల్లోని వారిని టార్గెట్‌‌ చేసి ఆన్‌‌లైన్‌‌ మోసాలు పెరిగిపోయాయి. ప్రత్యేకించి అమెరికాలో నివాసం ఉంటున్న ఇండియన్లతో పాటు అమెరికన్లను సైబర్‌‌‌‌ నేరగాళ్లు టార్గెట్ చేసుకున్నారు. కంప్యూటర్లు హ్యాక్‌‌ అయ్యాయని మెయిల్స్‌‌, మెసేజ్‌‌లు పంపిస్తున్నారు. ‘మీ వ్యక్తిగత వివరాలు హ్యాక్‌‌ అయ్యాయి.. మీ బ్యాంకు ఖాతాల్లోకి అనధికారిక, అనుమానాస్పద లావాదేవీలు పెద్ద మొత్తంలో జరిగాయి. మీపై దర్యాప్తు సంస్థల నిఘా కొనసాగుతోంది..’’ అని బెదిరిస్తున్నారు. ‘‘సైబర్‌‌ ముఠా వలకు చిక్కితే.. మీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును మేం చెప్పిన కొత్త బ్యాంకు ఖాతాల్లోకి మార్చుకోండి.. ఈ నేరం నుంచి మిమ్మల్ని బయటపడేయాలంటే మేం చెప్పినట్టుగా చేయండి” అని నమ్మిస్తున్నారు. ఆ తరువాత ఇంటర్నేషనల్‌‌ గిఫ్ట్‌‌ కార్డులు, క్రిప్టో కరెన్సీ రూపంలో పంపాలని బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలను అమెరికన్‌‌ దర్యాప్తు సంస్థలతో పాటు ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్‌‌ ఏజెన్సీలు గుర్తించాయి.

ఇంటర్నేషనల్ ఏజెన్సీల సమాచారంతో..

ఇంటర్‌‌పోల్‌‌, ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్‌‌ ఏజెన్సీలు అందించిన సమాచారంతో సీబీఐ ‘ఆపరేషన్‌‌ చక్ర-3’ చేపట్టింది. ఆన్‌‌లైన్‌‌ నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన 4 కాల్‌‌ సెంటర్లలో సోదాలు నిర్వహించింది. ఇందులో హైదరాబాద్‌‌లోని వయోజెక్స్‌‌ సొల్యూషన్స్‌‌, విశాఖపట్నంలోని వీసీ ఇన్ఫ్రో మెట్రిక్స్‌‌ ప్రై.లిమిటెడ్‌‌, అత్రియా గ్లోబల్‌‌ సర్వీసెస్‌‌ ప్రై.లిమిటెడ్‌‌, పుణె రీజెంట్‌‌ ప్లాజాలోని కాల్‌‌ సెంటర్లలో తనిఖీ చేశారు. పుణెలో 10 మంది, హైదరాబాద్‌‌లో ఐదుగురు, విశాఖపట్నంలో 11 మంది కీలక నిందితులను అరెస్టు చేశారు.