వస్తారా లేక : జూన్ 21 నుంచి జగన్ కేసుల విచారణ మళ్లీ మొదలు..

ఏపీ మాజీ సీఎం జగన్ పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ మళ్లీ మొదలైంది. 2024, జూన్ 21వ తేదీ నుంచి.. అంటే ఏపీలో కొత్త ప్రభుత్వం మొదటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న రోజునే.. హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో.. జగన్ పై ఉన్న కేసుల విచారణ మళ్లీ ప్రారంభం అవుతుంది. 

జగన్ అక్రమాస్తులకు సంబంధించి.. సీబీఐ 11 కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 9 కేసులు నమోదు చేసింది. వీటిలో చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. పదేళ్లుగా ఈ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఏపీలో 2019లో జగన్ సీఎం అయిన తర్వాత.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఇప్పుడు జగన్ కేవలం ఎమ్మెల్యే మాత్రమే.. దీంతో సీబీఐ, ఈడీ కేసుల్లో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో హాజరు అవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. 

జగన్ పై ఉన్న కేసుల్లో.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ.. ఇప్పటికే సీఐబీ కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేసింది. సీఎం హోదాలో పరిపాలన పనులు, భద్రతా కారణాల వల్ల కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు.. హైకోర్టు నుంచి వ్యక్తిగత హాజరు మినహాయింపు పొందారు జగన్. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. జగన్ కేవలం ఎమ్మెల్యే మాత్రంగానే ఉన్నారు. దీంతో జూన్ 21వ తేదీ నుంచి మళ్లీ మొదలవుతున్న విచారణకు జగన్ హాజరు అవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే జూన్ 21వ తేదీ నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉంటుంది సభలో..