పెళ్లిలో.. కట్నం గొడవ చూసుంటాం.. అతిథి మర్యాదల గొడవలు చూసుంటాం.. బరాత్ లో జరిగే గొడవలు చూసుంటాం.. ఆఖరికి విందు విషయంలో జరిగిన గొడవలు కూడా చూసుంటాం. కానీ, పూణే పెళ్లిలో జరిగిన గొడవ మాత్రం కొంత విచిత్రమైందే. ‘చిలికి చిలికి గాలివాన’ అన్నట్టు గులాబ్ జామ్ కోసం జరిగిన ఓ గొడవ పోలీస్ స్టేషన్ మెట్లెక్కేవరకు తీసుకెళ్లింది.
పూణేలో ఏప్రిల్ 23న లోఖండే, కంబాలే అనే రెండు ఫ్యామిలీల మధ్య వివాహ వేడుక జరిగింది. బంధువులందరినీ పిలిచి ఘనంగా పెళ్లి జరిపించారు. అతిథి మర్యాదలు స్వీకరించిన బంధువులు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. పెళ్లి వేడుకలు ముగిసాయి. అంతలో మిగిలిపోయిన ఫుడ్ తో పాటు గులాబ్ జామ్ ఇంటికి తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు క్యాటరింగ్ వాళ్లను కోరారు.
దానికి క్యాటరింగ్ బాయ్స్ నిరాకరించడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువుల్లో కొందరు క్యాటరింగ్ బాయ్స్ పై చేయి చేసుకోవడంతో వివాదం ఇంకా ముదిరింది. గొడవ సద్దుమణగక పోవడంతో ఈవెంట్ మేనేజర్ దీపాంశు గుప్తా.. హడప్సర్ పోలీస్ స్టేసన్ లో ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి బందువులను మందలించారు.
