సమగ్ర సర్వే పూర్తి... కోటి 14 లక్షల కుటుంబాల డేటా రెడీ

 

  • రాష్ట్ర వ్యాప్తంగా 100 శాతం కంప్లీట్
  • జీహెచ్ఎంసీ లోనే లక్ష ఇండ్లకు పైగా లాక్
  • నాలుగైదు రోజుల్లోపే డిజిటలైజేషన్ పూర్తి
  • డేటా ఎంట్రీలో తప్పులు జరగకుండా 800 కోడ్స్​తో కంప్యూటరైజేషన్ 
  • పది రోజుల్లోపే ప్రభుత్వానికి పూర్తి నివేదిక

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గత నెలలో మొదలుపెట్టిన  సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే పూర్తయింది. జీహెచ్ఎంసీ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ దాదాపు 100 శాతం ఇండ్ల సర్వే పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోటి 17 లక్షల 47 వేల ఇండ్లకు స్టిక్కరింగ్​ చేశారు. ఇందులో కోటి 14 లక్షల ఇండ్ల వరకు సర్వే పూర్తి చేసినట్టు తెలిసింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే కేవలం రెండున్నర లక్షలలోపు ఇండ్లు మాత్రమే మిగిలినట్టు తెలుస్తున్నది. ఇందులోనూ కొంతమంది గ్రామాల్లో వివరాలు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఇంకొన్ని ఇండ్లు లాక్ ఉండడంతోపాటు కొన్నింటిని నివాస గృహం అనుకుని స్టిక్కరింగ్ చేసినప్పటికీ.. వాటిలో వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. దీంతో వాటిని తీసేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర కుల గణన సర్వే పూర్తయిందని అధికార వర్గాలు వెల్లడించాయి.  నవంబర్ 6 నుంచి ప్రభుత్వం కుల గణన సర్వేను చేపట్టింది. తొలుత ఇండ్లకు స్టిక్కర్లు అంటించగా.. 9వ తేదీ నుంచి వివరాల నమోదు మొదలుపెట్టారు. దాదాపు ఈ నెల 6  వరకు 90 వేలకు పైగా ఎన్యుమరేటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. 

పూర్తవుతున్న డిజిటలైజేషన్​

ఎన్యుమరేటర్లు ఇంటింటికీ  వెళ్లి సేకరించిన సమాచారాన్ని ప్రస్తుతం డిజిటైలైజ్​ చేస్తున్నారు. దాదాపు 50 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్​​వేర్​లో కుల గణన సర్వే వివరాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 70 శాతం మేర కంప్యూటీకరణ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకో నాలుగైదు రోజుల్లోనే పూర్తి సమాచారం డిజిటలైజ్​ చేస్తామని తెలిపారు. డేటా ఎంట్రీలో ఎక్కడా తప్పులు జరగకుండా కోడ్స్​ సిస్టమ్​ను అమలు చేశారు. మాన్యువల్​గా ఎంట్రీ చేయకుండా నేరుగా కోడ్​ను సెలెక్ట్​, టిక్​ చేసేలా ప్రత్యేక సాఫ్ట్​వేర్​ను ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంతో హ్యుమన్​ ఎర్రర్స్​ కూడా చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. డిజిటలైజేషన్ తర్వాత ఏయే సమాచారం నివేదిక రూపంలో ఇవ్వాలనే దానిపై డేటాను కంపైల్​ చేసి, ప్రభుత్వానికి నివేదించనున్నారు.  రాష్ట్రంలో సేకరించిన సమగ్ర ఇంటింటి కుల గణన సమాచారాన్ని  ఒక పుస్తక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు తెలిసింది. అప్పటికీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నట్లయితే.. అవసరం అనుకుంటే ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నది.  

సర్వే సమాచారం సాఫ్ట్​వేర్​లో లాక్​

 సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే పూర్తి సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని అధికారులను  రాష్ట్ర ప్రభుత్వం  ఆదేశించింది. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్​ కమిషన్​కు కూడా పూర్తి సమాచారం ఇవ్వొద్దని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఎంత దాకా కమిషన్​ డేటా అవసరమో అంతే ఇవ్వాలని సూచించింది. దీంతో సమాచారం జాగ్రత్తగా సాఫ్ట్​​వేర్​లో లాక్​ చేయనున్నారు.