టికెట్​ లేకుండా రైళ్లలో జర్నీ చేసిన 68,746 మందిపై కేసులు

  • రూ.1.32 కోట్ల జరిమానాలు వసూలు: అరోమా సింగ్ ఠాకూర్
  • దక్షిణ మధ్య రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వార్షిక నివేదిక రిలీజ్ 

సికింద్రాబాద్, వెలుగు: రైల్వే ఆస్తులు, భద్రతను కాపాడటంతోపాటు ప్యాసింజర్లకు అండగా ఉండటంలో  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ముందంజలో ఉంటుందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దక్షిణ మధ్య రైల్వే, ఐజీ కమ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్  అరోమా సింగ్ ఠాకూర్​ వెల్లడించారు. మంగళవారం ఆమె ఈ ఏడాది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సాధించిన ప్రగతి, చేధించిన కేసులపై వార్షిక నివేదికను రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా అరోమా సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది 68,746 మంది రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం చేశారన్నారు. వారిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేసులు నమోదు చేసి రూ.1.32 కోట్ల జరిమానాలు వసూలు చేసిందన్నారు.  “ఆపరేషన్ రైల్ సురక్ష” చేపట్టి రూ.83.31 లక్షల విలువైన రైల్వే ఆస్తులను కాపాడామన్నారు. ఆపరేషన్ యాత్రి సురక్ష ద్వారా  ప్రయాణికుల నుంచి దొంగతనానికి గురైన రూ.3.17 కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశామన్నారు. 

ఆపరేషన్ నన్ హీ ఫరిస్తే కింద వివిధ కారణాలతో ఇంటి నుంచి  పారిపోయిన, తప్పిపోయిన 240 మంది బాలికలతో సహా మొత్తం 1385 మంది పిల్లలను వారి తల్లి తండ్రులకు అప్పగించామని వెల్లడించారు. -ఆపరేషన్ ఆహతి  ద్వారా  మానవ అక్రమ రవాణా దారుల బారి నుంచి 476 మంది బాలురు, 15 మంది బాలికలను రక్షించామని వివరించారు. రైల్వేల ద్వారా జరుగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఆపరేషన్ నార్కోస్ కింద 111 కేసుల్లో మొత్తం 127 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేశామని..వారి నుంచి కోట్లు విలువ చేసే 2,311 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

ఆపరేషన్ అమానత్  కార్యక్రమం ద్వారా2,576  ప్రయాణికులకు వారు పోగొట్టుకున్న  సుమారు రూ. 6,93,48,568ల  విలువైన  వస్తువులను అందజేశామని అరోమా సింగ్ ఠాకూర్​ పేర్కొన్నారు.  దక్షిణ  మధ్య రైల్వే జనరల్ మేనేజర్​ అరుణ్​కుమార్ జైన్​మాట్లాడుతూ.. 2024లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విధి నిర్వహణలో ప్రదర్శించిన అంకితభావానికి అభినందించారు.