ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి పట్టా.. నారాయణపేట తహసీల్దార్ పై కేసు న‌మోదు

నారాయణపేట, వెలుగు: ఓ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో వేరొకరి పేరు మీద పట్టా చేశారన్న ఆరోపణలతో నారాయణపేట తహసీల్దార్, ఆర్ఐ, నోటరీ అడ్వకేట్ పై కేసు నమోదైంది. నారాయణపేట జిల్లా గనిమోనిబండ గ్రామానికి చెందిన బండమీది లక్ష్మి ఫిర్యాదు మేరకు నారాయణపేట రూరల్  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గనిమోనిబండ గ్రామానికి చెందిన బండమీది లక్ష్మి, బి లక్ష్మప్ప, బి జనార్దన్, బి పెద్దలక్ష్మప్ప తోబుట్టువులు. వీరికి నారాయణ అనే మరో సోదరుడు ఉండగా, 40 ఏండ్ల కింద వేరే గ్రామానికి ఇల్లరికం వెళ్లాడు. అప్పటి నుంచి అతడికి, వీరికి ఎలాంటి సంబంధాలు లేవు. వీరి తల్లి బండమీది లక్ష్మమ్మ పేరు మీద 1.05 ఎకరాల భూమి ఉండగా, ఆ భూమిని ఈ నలుగురు సాగు చేసుకుంటున్నారు. లక్ష్మమ్మ 2019లో చనిపోగా, ఆ భూమిని నారాయణ పేట జిల్లా మద్దూరు మండలం జాదవరావుపల్లి గ్రామానికి చెందిన చిన్న ఆశప్ప తన పేరిట పట్టా చేసుకున్నాడు.

ఇల్లరికం వెళ్లిన నారాయణ కొడుకును తానేనని, భూమిని తన పేరిట మార్చేందుకు అందరూ ఒప్పుకున్నారని అఫిడవిట్  తయారు చేశాడు. ఆ భూమికి వారసులమైన తాము లేకుండానే.. సంతకాలు చేసినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

2023 డిసెంబర్ లో తమ భూమిని చిన్న ఆశప్ప అక్రమంగా పట్టా చేసుకున్నాడని, దీనికి అప్పటి నారాయణపేట తహసీల్దార్ వై. దానయ్య, గిర్దావర్ శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ కు చెందిన నోటరీ అడ్వకేట్ ఎల్. వెంకటరెడ్డి, సహకరించారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే నవంబర్​ 25న కేసు నమోదు కాగా, విషయం బయటకు రాలేదు. రూరల్​ పోలీసులను దీనిపై వివరణ కోరగా.. కేసు నమోదు చేసిన విషయం నిజమేనని, విచారణ చేస్తున్నామని తెలిపారు.