వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్ గోముల్ పోలీస్ స్టేషన్ లో ఎంపీ అసదుద్దీన్ పై కేసు నమోదు అయింది. లోక్ సభలో ఎంపీగా ప్రమాణం చేసే సమయంలో అసదుద్దీన్ అనుచిత వ్యాఖ్య లు చేశారంటూ పూడూరు మండల బీజేపీ అధ్యక్షుడు రాఘవేందర్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఎంపీ అసదుద్దీన్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లోక్ సభ సభ్యత్వం రద్దు చేసి పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎంపీ అసదుద్దీన్ పై కేసు నమోదు చేశారు పూడూర్ పోలీసులు.
జూన్ 25న లోక్ సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు అసదుద్దీన్ ఒవైసీ.. ఆ సమయంలో జై తెలంగాణ, జై మీమ్.. జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు దీంతో వివాదం రేగింది. లోక్ సభలో బీజేపీ ఎంపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. లోక్ సభ రికార్డులనుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు. దీంతో స్పీకర్ రికార్డులనుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు.
అసదుద్దీన్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పలు చోట్ల అసదుద్దీన్ పై కేసులు నమోదు అయ్యాయి. అయితే తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు అసదుద్దీన్ ఒవైసీ.