గుంటూరు: నకిలీ పత్రాలతో అధికారుల కళ్లు గప్పి ఆరేళ్ల పాటు ఎస్ఐగా విధులు నిర్వర్తించాడు ఓ నకిలీ పోలీస్. చివరకు ఓ చిన్న గొడవ కారణంగా అతని బాగోతం బట్టబయలైంది.ఏపీలోని గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి 2011 ఎస్ఐ రిక్రూట్మెంట్‌లో అర్హత సాధించాడు. అతనికి రెండేళ్లు వయసు అధికంగా ఉండటంతో అధికారులు అభ్యంతరం చెప్పారు. అంతకు ముందు ఎన్సీసీలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసినట్లు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారు. మూడేళ్ల సడలింపు ఉండటంతో ఉద్యోగం సంపాదించాడు.
కొన్ని రోజుల క్రితం ప్రకాశం జిల్లా కొమరోలులో ఎస్‌ఐగా పనిచేస్తున్న సమయంలో ఎంపీడీవోతో గొడవ జరిగింది. దీంతో అతడు ఎస్ఐ తీరుపై అనుమానం వచ్చి ఆరా తీయడంతో నకిలీ పత్రాలు పెట్టినట్టుగా తేలింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మార్కాపురం డీఎస్పీ విచారణ చేపట్టి దీన్ని నిర్ధారించారు. వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అతడు గుంటూరు జిల్లాలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో అటాచ్‌మెంట్ ఎస్‌ఐగా పని చేస్తున్నాడు. అయితే ఆరేళ్ల పాటు ఉద్యోగం చేస్తున్నా అధికారులు గుర్తించకపోడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంత అలసత్వం వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
