Beauty Hair.ఈ విషయం మీకు తెలుసా.. క్యారెట్​ హెయిర్​ మాస్క్​ తో ​.. జుట్టు బాగా పెరుగుతుందట..

మగువలు (మహిళలు) జుట్టుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.  జుట్టు పొడుగ్గా పెరిగేందుకు అనేక రకాల ట్రిక్స్​ వాడుతుంటారు.  ఇక నల్లగా ఉండేందుకు వాడే హెయిర్​ ఆయిల్స్​ అన్నీ ఇన్నీ కావు. తరచే అంటే వారంలో కనీసం రెండు నుంచి నాలుగు సార్లు క్యారెట్​మాస్క్​ వాడితే జుట్టు సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

 క్యారెట్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. క్యారట్‌లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ, బి,సితో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. క్యారెట్ ఆరోగ్యానికే కాదు ...జుట్టు సంరక్షణకు ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

 క్యారెట్‌తో కొన్ని పదార్థాలను కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకుని వాడాలని సూచిస్తున్నారు.   క్యారెట్ హెయిర్ మాస్క్ వాడటం వల్ల ఏవైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగిపోతాయి. జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న క్యారెట్ హెయిర్ మాస్క్‌లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్, అవకాడో మాస్క్

క్యారెట్స్, అవకాడోలను సమంగా తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత  మిక్సీలో వేసి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక చిన్న బౌల్ లోకి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనెను కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని స్కాల్ప్ నుంచి జుట్టు కుదుళ్ల వరకు అప్లై చేసి.. స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి. పొడి జుట్టు ఉన్న వారు ఈ మాస్క్ వాడితే జుట్టు మృదువుగా తయారవడంతో పాటు ఒత్తుగా పెరుగుతుంది.

క్యారెట్, ఆలివ్ ఆయిల్ మాస్క్ ఉపయోగాలు..

ఈ మాస్క్ జుట్టు పెరుగుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకోసం ముందుగా ఒక మీడియం సైజు ఉన్న క్యారెట్‌ను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని మిక్సీ జార్‌లో వేసి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్‌లాగా చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి అది ఆరే అంత వరకూ ఉంచుకోవాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. 

2017 జర్నల్ అఫ్ డెర్మటాలజికల్ సైన్స్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం క్యారెట్‌లో ఉండే విటమిన్స్ స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చుండ్రును తగ్గిస్తాయి. ఇందుకు సంబంధించిన పరిశోధన దక్షిణ కొరియాలోని సియోల్ యూనివర్సిటీలో జరిగింది.ఇందులో పాల్లొన్న డెర్మటాలజిస్ట్‌లు క్యారెట్ సంబంధిత హెయిర్ మాస్క్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయని వెల్లడించారు.

క్యారెట్,ఎగ్ మాస్క్

ఇలాంటి హెయిర్ మాస్క్ కూడా జుట్టు రాలడాన్ని తగ్గించి వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మాస్క్ కోసం ఒక క్యారెట్ ను తీసుకుని దానిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై మిక్సీ జార్ తీసుకొని అందులో గుడ్డు పగులగొట్టి వేసుకోవాలి. దానిలోనే క్యారెట్ ముక్కలు , రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆపై మిశ్రమాన్ని తలకు అప్లై చేసి అరగంట తర్వాత వాష్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

క్యారెట్, కొబ్బరి పాల మాస్క్

 ముందుగా ఒక క్యారెట్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని మిక్సీలో వేసి జ్యూస్‌ పట్టుకొని దాని నుంచి రసాన్ని ఒక బౌల్‌లో ఫిల్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో పావు కప్పు కొబ్బరిపాలను కూడా కలుపుకోవాలి. అనంతరం కాటన్ బాల్ సహాయంతో ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. అరగంట పాటు అలాగే ఉంచి ఆపై షాంపుతో తలస్నానం చేయాలి. ఇది జుట్టు డ్యామేజ్‌ను తగ్గించి జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది.